రైతుల ఉద్యమంపై డ్రెస్సింగ్ రూంలో ఇండియన్ టీం చర్చలు




భారతదేశంలో జరుగుతున్న రైతుల ఉద్యమంపై  క్రికెట్ టీం సమావేశంలో  తాము చర్చించుకున్నట్టు ఇండియన్ టీం కెప్టెన్ విరాట్ కొహ్లీ వెల్లడించాడు. భారత్, ఇంగ్లండ్ టీం ల మధ్య రేపు చెన్నైలో మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఈ రోజు(ఫిబ్రవరి4) మీడియాతో మాట్లాడిన కోహ్లీ ఈ విషయం తెలిపాడు. 

"డ్రెస్సింగ్ రూమ్ సంభాషణలలో రైతు ఉద్యమంపై మాట్లాడుకుంటున్నారా? అని ఓ విలేకరిని అడిగిన ప్రశ్నకు విరాట్ బదులిస్తూ “దేశంలో ఏదైనా సమస్య ఉంటే, మేము దాని గురించి చర్చిస్తాము, దాని గురించి అందరం మాట్లాడుతాము. ప్రతి ఒక్కరూ ఆ సమస్య గురించి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. ఈ సారి కూడా రైతు ఆందోళనల‌ గురించి  జట్టు సమావేశంలో క్లుప్తంగా మాట్లాడాము. మరియు  జట్టు ప్రణాళికలు  మ్యాచ్  గేమ్‌ప్లాన్‌ల గురించి చర్చించాము. ” అన్నాడు.

కాగా భారతదేశంలో కొనసాగుతున్న రైతుల నిరసనల‌పై అంతర్జాతీయ పాప్ సంచలనం రిహన్న ట్వీట్ చేసిన తర్వాత  కేంద్ర ప్రభుత్వ పెద్దలు మొదలు పెట్టిన క్యాంపెన్ ను సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీతో సహా వివిధ క్రికెట్ ప్రముఖులు అందుకున్నారు. దీనిపై టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. 

"విభేదాల ఈ సమయంలో మనమందరం ఐక్యంగా ఉండాలి. రైతులు మన దేశంలో ఒక భాగమే.  శాంతిని నెలకొల్పడానికి, అందరం కలిసి ముందుకు సాగడానికి అందరి మధ్య స్నేహపూర్వక పరిష్కారం లభిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.'' అని ట్వీట్ చేసిన ఆయన  దానికి ప్రభుత్వ పెద్దలు మొదలుపెట్టిన‌ #IndiaTogether అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించాడు.

విరాట్ తో సహా పలువురు క్రికెటర్లు, బాలీవుడ్ ప్రముఖులు చేసిన ఈ ట్వీట్లపై నెటిజనులు తీవ్రంగా విరుచుకపడ్డారు. రెంఉన్నర నెలలుగా రైతులు చలిలో ఎండలో అనేక కష్టాలు భరిస్తూ, ప్రభుత్వదుర్మార్గమైన అణిచివేతను ఎదిరిస్తూ పోరాడుతుంటే పట్టించుకోని వీరందరూ రిహన్నా ట్వీట్ చేయగానే స్పందించడంపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 


Latest News
more

Trending
more