Heat Wave Alert : దేశంలో భానుడి భగభగ.. వడగాలుల తీవ్రత పెరగొచ్చు : ఐఎండీ హెచ్చరిక!




దేశంలో ప్రచండ భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 8 గంటలకే ఎండలు మండుతున్నాయి. మాడు పగులుతోంది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు హర్యానా, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, బీహార్‌, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, తెలంగాణ ,ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలను దాటిపోతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక నిజామాబాద్‌లో 43.1 డిగ్రీలు, కర్నూలులో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఉష్ణోగ్రత అంతకంతకూ పెరుగుతోంది. వడగాలుల తీవ్రత మరింత పెరగవచ్చని ఐఎండీ అంచనా హెచ్చరిస్తోంది.

ఒక్కరోజే రెండు నుంచి మూడు డిగ్రీలు ఉష్ణోగ్రత పెరగవచ్చని చెబుతోంది. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతోపాటు అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాలను హెచ్చరించారు. దేశంలో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితిపై బుధవారం వర్చువల్ విధానంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల సమావేశంలో… దేశంలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయని, మామూలుగా కన్నా రెండు మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని చెప్పారు.

అడవులు, ముఖ్యమైన భవనాలు, ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు పెరుగుతుండటం ఇటీవల మనం చూస్తున్నామని.. ఫైర్‌ సేఫ్టీని పాటించాలని సూచించారు. మరోవైపు రానున్న ఐదు రోజుల్లో తూర్పు, మధ్య, వాయవ్య భారత దేశంలో వడగాడ్పుల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బాలలు, వృద్ధులు, తీవ్ర స్థాయిలో వ్యాధులతో బాధపడేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.


Latest News
more

Trending
more