హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. ముంబై ఇండియన్స్ సంచలన విజయం




వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ మరో సంచలన విజయాన్ని అందుకుంది. గుజరాత్ జెయింట్స్‌తో శనివారం జరిగిన ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సూపర్ హిట్టింగ్‌తో విజయాన్ని అందుకుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు చేసింది. కెప్టెన్ బెత్ మూనీ(35 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66), దయాలన్ హేమలత(40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 74) హాఫ్ సెంచరీలతో రాణించగా.. భార్టి ఫుల్మాలి(13 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 21 నాటౌట్) మెరుపులు మెరిపించింది.

ముంబై బౌలర్లలో సైకా ఇషాక్(2/31) రెండు వికెట్లు తీయగా.. హీలీ మాథ్యూస్, షబ్నిమ్ ఇస్మాయిల్, పూజా వస్త్రాకర్, సజీవన్ సంజన తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ 19.5 ఓవర్లలో 3 వికెట్లకు 191 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(48 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 95 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. యస్తికా భాటియా(36 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 49) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకుంది.

గుజరాత్ బౌలర్లలో అష్లే గార్డ్‌నర్, తనుజా కాన్వర్, షబ్నమ్ తలో వికెట్ తీసారు. ఆఖరి ఓవర్‌లో ముంబై విజయానికి 13 పరుగులు అవసరమవ్వగా.. అష్లే గార్డ్‌నర్ బౌలింగ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ తొలి రెండు బంతులకు 6, 4 బాది విజయానికి బాటలు వేసింది. తర్వాత మూడు బంతుల్లో మూడు సింగిల్స్ రావడంతో ముంబై విజయం లాంఛనమైంది.

అమెలియా కేర్‌తో కలిసి హర్మన్‌ప్రీత్ కౌర్ నాలుగో వికెట్‌కు అజేయంగా 93 పరుగులు జోడించింది. ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన హర్మన్‌ప్రీత్ కౌర్ మరోసారి తాను మ్యాచ్ విన్నర్‌ను అనే విషయాన్ని చాటి చెప్పింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ ఐదు విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.


Latest News
more

Trending
more