ధర్నా చౌక్ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, సీపీ




ధర్నా చౌక్ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, సీపీ

అక్షర విజేత, నిజామాబాద్ ప్రతినిధి : జిల్లా కేంద్రంలో నూతనంగా కేటాయించిన ధర్నా చౌక్ స్థలాన్ని బుధవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సందర్శించారు. ప్రజా సంఘాలు, వివిధ పక్షాల వారు ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసనలు తెలిపేందుకు వీలుగా జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ఎదురుగా సుమారు వేయి చదరపు గజాల స్థలాన్ని జిల్లా యంత్రాంగం ధర్నా చౌక్ కోసం కేటాయించింది. ఈ స్థలాన్ని పరిశీలించిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలు, ప్రజాసంఘాలు, వివిధ వర్గాల వారు  తమ నిరసన తెలియజేసేందుకు వీలుగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఓల్డ్ కలెక్టరేట్ ఎదుట వెయ్యి చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తూ కొత్తగా ధర్నా చౌక్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.  నిరసనలు తెలియజేయాలనుకునే వారు ముందస్తుగా పోలీస్ శాఖ ద్వారా అనుమతి తీసుకుని కొత్తగా ఏర్పాటు చేసిన ధర్నా చౌక్ ప్రాంతంలో నిరసన చేపట్టాలని సూచించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం వద్ద, పాత కలెక్టరేట్ ప్రధాన రహదారికి ఆనుకుని నిరసనలు నిర్వహిస్తుండడం వల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కొత్తగా ధర్నా చౌక్ కోసం స్థలాన్ని కేటాయించామన్నారు. ఇక నుండి నిరసనలు తెలిపే వారు ముందుగా పోలీసు శాఖ నుండి అనుమతి తీసుకుని కొత్తగా కేటాయించిన ధర్నా చౌక్ స్థలంలో నిరసనలు తెలపాలని సూచించారు.  కొత్త ధర్నా చౌక్ ప్రదేశంలో నిరసనలు తెలిపే వారి కోసం అవసరమైన సదుపాయాలు కూడా కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ, సాధారణ ప్రజలకు ఇబ్బంది కలుగకుండా, ముందస్తు అనుమతితో కొత్తగా ఏర్పాటు చేసిన ధర్నా చౌక్ ప్రదేశంలోనే నిరసనలు తెలుపాల్సి ఉంటుందని సూచించారు. ముందస్తు అనుమతి లేకుండా నిరసనలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది ఇప్పటికే ఈ తరహా ఉల్లంఘనలకు సంబంధించి మూడు కేసులు నమోదయ్యాయని తెలిపారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, ఏ.సీ.పీ రాజా వెంకట్ రెడ్డి, సౌత్ తహశీల్దార్ బాలరాజు తదితరులు ఉన్నారు.
 


Latest News
more

Trending
more