జో రూట్ సెంచరీ…భారీ స్కోరు దిశగా ఇంగ్లాండ్




చెన్నై వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో ఇంగ్లాండ్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. సూపర్ ఫామ్ లో ఉన్న రూట్ సెంచరీ చేయడం విశేషం. టెస్టుల్లో అత‌నికిది 20వ సెంచ‌రీ. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. బర్న్- సిబ్లే జోడి టీమిండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదురుకొని మొదటి వికెట్ కు 63 పరుగులు జోడించారు.  అయితే లంచ్‌కు ముందు రెండు ఓవ‌ర్ల వ్య‌వ‌ధిలో రెండు వికెట్లు కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో రివ‌ర్స్ స్వీప్ ఆడ‌బోయిన బ‌ర్న్స్.. వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌కు క్యాచ్ ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన లారెన్స్ (0) బుమ్రా బౌలింగ్‌లో వికెట్ల‌కు అడ్డంగా దొరికిపోయాడు.  ఈ దశలో క్రీజులోకి వచ్చిన రూట్ మరో ఎండ్ లో ఉన్న సిబ్లేతో కలిసి జట్టును ముందుకు నడిపించారు. 

లంచ్ విరామం తరువాత కూడా నత్తనడకన సాగిన ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ రూట్ జోరు పెంచడంతో వేగంగా కదిలింది. ఈ జోరులోనే రూట్ అర్ద సెంచరీ పూర్తి చేశాడు. సిబ్లే సహకారంతో మరింత వేగంగా ఆడిన రూట్ సెంచరీ పూర్తి చేశాడు. 100వ టెస్టులో సెంచరీ సాధించిన 9వ ఆటగాడిగా నిలిచాడు. అంతే గాకుండా 98,99,100 టెస్టులలో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. తొలి హాఫ్ సెంచరీ సాధించడానికి 114 బంతులు తీసుకున్న రూట్‌ .. ఆ తర్వాతి 50 పరుగులను మాత్రం కేవలం 50 బంతుల్లోనే చేయడం విశేషం. ఆ తరువాత కూడా దూకుడుగా ఆడిన రూట్ జట్టు స్కోరును 263 పరుగులకు చేర్చాడు. సిబ్లే-రూట్ జోడి మూడవ వికెట్ కు 200 పరుగులు జోడించారు. తొలి రోజు చివరి ఓవర్ వేసిన బుమ్రా సెంచరీకి చేరవుతున్న సిబ్లే(87)ని పెవిలియన్ చేర్చాడు. దీంతో అంపైర్లు తొలి రోజు ఆట ముగిసినట్లు ప్రకటించారు. రూట్ 128 పరుగులతో నాటౌట్ గా క్రీజులో నిలిచారు. 


Latest News
more

Trending
more