బీజేపీని బీజేడీ అడ్డుకోగలదా? ఒడిశాలో కాంగ్రెస్​కు ‘టాటా- బైబై’ తప్పదా!




024 లోక్​సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. అభ్యర్థుల ఎంపిక, పొత్తులు- ఎత్తులు- పైఎత్తులతో పార్టీలన్నీ బిజీబిజీగా గడుపుతున్నాయి. వీటన్నింటి మధ్య.. ఒడిశా రాజకీయాలు గత కొన్ని రోజులుగా రసవత్తరంగా మారాయి. బీజేడీ- బీజేపీ మధ్య పొత్తు కుదిరినట్టే కుదిరి.. చివరి నిమిషంలో ఆగిపోయింది! ఈ పరిణామాలు లోక్​సభతో పాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఏమేరకు ప్రభావం చూపిస్తాయి? రాష్ట్రంపై వేగంగా పట్టు సాధిస్తున్న బీజేపీని.. రాజకీయాల్లో అత్యంత సీనియర్​ అయిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​ అడ్డుకోగలరా?

2019 లోక్​సభ ఎన్నికల ఫలితాలు..

లోక్​సభలో మొత్తం 545 సీట్లు ఉంటాయి. 543 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. వీటిల్లో ఒడిశా రాష్ట్రంలో 21 సీట్లు ఉన్నాయి. 2019 లోక్​సభ ఎన్నికల్లో.. నవీన్​ పట్నాయక్​కి చెందిన బీజేడీ (బిజు జనతాదళ్​).. 12 సీట్లల్లో గెలిచింది. బీజేపీ 8 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్​ నేతృత్వంలోని యూపీఏకి ఒక్క సీటు దక్కింది.

వాస్తవానికి.. ఒడిశాలో అనాదిగా.. నవీన్​ పట్నాయక్​ పాలన సాగుతోంది. 2 దశాబ్దాల పాటు రాష్ట్రంపై ఆయన పట్టు కొనసాగుతూ వస్తోంది. కానీ 2019లో బీజేడీకి షాక్​ తగిలిందనే చెప్పుకోవాలి! 'మోదీ మేనియా ఒడిశాపై ఊహించని విధంగా పనిచేసిందనే చెప్పొచ్చు. 2014లో బీజేపీ కేవలం ఒక్కటే సీటులో గెలిచింది. కానీ.. 2019 వచ్చేసరికి 8చోట్ల కాషాయ జెండాను ఎగరవేసింది. ఇది బీజేడీకి తలనొప్పిగా మారిన విషయం.

ఇంకా చెప్పాలంటే.. 2019 లోక్​సభ ఎన్నికల సమయంలో ఓటు షేరు విషయంలోనూ బీజేడీకి గట్టిపోటీనిచ్చింది కమలదళం. నవీన్​ పట్నాయక్​ పార్టీకి 42.8శాతం ఓట్లు దక్కాయి. 38.4శాతంతో ఆ తర్వాతి స్థానంలో బీజేపీ ఉంది.

ఇక ఒడిశాపై కాంగ్రెస్​ పట్టు అంతంతమాత్రంగానే ఉంటూ వస్తోంది. 2014లో యూపీఏ ఖాతా తెరవలేదు. 2019లో కాంగ్రెస్​ పార్టీకి ఒక్కటంటే ఒక్కటే సీటు దక్కింది.


 


Latest News
more

Trending
more