క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అశోక్ దిండా




టీమ్ ఇండియా సీనియర్ పేసర్ అశోక్ దిండా అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు మంగళవారం ప్రకటించాడు. తన కెరీర్‌కు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు.. ఇకపై ఏ ఫార్మాట్‌లోనూ క్రికెట్ ఆడబోవడం లేదని దిండా స్పష్టం చేశాడు. టీమ్ ఇండియా తరపున 13 వన్డేల్లో 12 వికెట్లు, 9 టీ20 మ్యాచుల్లో 17 వికెట్లు తీశాడు.

2009లో నాగ్‌పూర్ వేదికగా శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2013లో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డేనే అతడి చివరి మ్యాచ్. కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో అంతగా రాణించని అశోక్ దిండాకు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మంచి రికార్డు ఉన్నది. బెంగాల్ తరపున 116 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన దిండ 420 వికెట్లు తీశాడు. 5 వికెట్ల ప్రదర్శన 26 సార్లు, పది వికెట్ల ప్రదర్శన 5 సార్లు చేశాడు.

బెంగాల్ తరపున అత్యధిక వికెట్లు తీసిన ఘనత ఆశోక్ దిండా పేరిటే ఉన్నది. ఇక ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, పూణే వారియర్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. ఐపీఎల్‌లో 78 మ్యాచ్‌లు ఆడి 68 వికెట్లు పడగొట్టాడు.

2013 వరకు గొప్పగా సాగిన అతని కెరీర్ క్రిస్ గేల్ పుణ్యమా భవిష్యత్తు లేకుండా పోయింది. అదే ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్‌లో అప్పటి ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ దిండా బౌలింగ్‌ను చీల్చిచెండాడాడు. ఆ మ్యాచ్‌లో ఈ విండీస్ వీరుడి ధాటికి దిండా ఏకంగా 63 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో ఏ బౌలర్ ఎక్కువ పరుగులిచ్చినా.. ఐపీఎల్ వేలంలో అమ్ముడు పోకపోయినా దిండా అకాడమీ, క్లబ్‌లోకి స్వాగతం అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తుంటారు


Latest News
more

Trending
more