
– విద్యార్థుల ఆరోగ్యంపై మెడికవర్ ప్రత్యేక శ్రద్ధ
విజేత,హన్మకొండ బ్యూరో : విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా హన్మకొండలోని శ్రీ చైతన్య సీబీఎస్ఈ పాఠశాలలో మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్య నిపుణులు విద్యార్థులకు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.మెడికవర్ హాస్పిటల్కు చెందిన పీడియాట్రిషియన్ డాక్టర్ అశ్రీత రావు, దంత వైద్య నిపుణురాలు డాక్టర్ తబస్సుమ్ అఫ్షాన్ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం, పిల్లల ఆరోగ్య సంరక్షణ, దంతాల పరిశుభ్రత వంటి అంశాలపై పలు సూచనలు చేశారు. చిన్న వయస్సు నుంచే ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని,పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలని,వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలన్నారు.
అంతేకాక దంతాలను క్రమం తప్పకుండా శుభ్రంగా ఉంచుకుంటూ,వ్యాధుల లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని విద్యార్థులకు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీ విద్య, డీజీఎం చేతన్, ఏజీఎం మనోహర్, ప్రిన్సిపల్ లక్ష్మి, కోఆర్డినేటర్ శివ కోటేశ్వర్, డీన్ కర్ణాకర్, ప్రైమరీ ఇన్చార్జ్ షాహిన్, ప్రీ ప్రైమరీ ఇన్చార్జ్ శ్రావణి, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ విద్యతో పాటు విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్య వికాసానికి ప్రాధాన్యతనిస్తూ ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని ,విద్యార్థుల ఆరోగ్యమే సమాజ ఆరోగ్యానికి పునాది అనే లక్ష్యంతో భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని పాఠశాల యాజమాన్యం పేర్కొన్నారు.









