ప్రాణాలతో చెలగాటం..హోమియోపతి బోర్డు వెనక కత్తి రాజ్యం?

• షాద్‌నగర్‌లో దాదాజీ హోమియో కలకలం..బోర్డుపై హోమియో…లోపల సర్జరీ.?..

• రూ.25 వేల ఆపరేషన్, రూ.1.5 లక్షల ఆసుపత్రి బిల్లు..

• మూడు రోజుల్లో డ్యూటీకి వెళ్లిపోవచ్చు! ఒక్క మాట నెలల తరబడి మంచానికే పరిమితం..

• చిన్న లేదు పెద్ద లేదు 12 ఏళ్ల పసివాళ్లపైనా ఇదే చికిత్సా?..

• ఒకవైపు కార్పొరేట్ దోపిడీ… మరోవైపు ముసుగు వైద్యుల కత్తి!..

• పేదోడి ప్రాణానికి దిక్కెవరు? 

ఇంత జరుగుతున్నా వైద్య ఆరోగ్య శాఖ ఎక్కడ? ఇంకెన్నాళ్లీ ఈ నిద్ర?..

విజేత, షాద్‌నగర్ : ఒకవైపు కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల బిల్లుల భారం. పరీక్షల మీద పరీక్షలు, ఐసీయూ పేరుతో రోజుల తరబడి వేలాది రూపాయల బిల్లులు సామాన్యుడి కష్టార్జితాన్ని, ఇంటిని, బంగారాన్ని ఊడ్చేస్తున్నాయని ఎందరో రోగుల ఆవేదన. మరోవైపు, ఆ భారానికి భయపడి చౌకగా, త్వరగా తగ్గిస్తామని చెప్పేవారి వైపు పరుగెత్తే పేదలు, మధ్యతరగతి ప్రజలు. ఇదే అదనుగా ఊరూరా అర్హతలు సరిగా లేని ఆర్ఎంపీ, పీఎంపీ తరహా చిన్న పార్టీ వైద్యులు ఇష్టారాజ్యంగా ఇంజెక్షన్లు, సెలైన్లు, మందులు ఇస్తున్నారు. కొందరు చిన్న గదుల్లో చిన్నపాటి ఆపరేషన్లు కూడా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. శుభ్రమైన థియేటర్ ఉండదు, అనస్థీషియా నిపుణులు ఉండరు, అత్యవసర ఏర్పాట్లు ఉండవు. ఏదైనా తేడా వస్తే రోగిని కార్పొరేట్ ఆసుపత్రికి తరలిస్తారు, అక్కడ మళ్లీ లక్షల బిల్లు. రెండు వైపులా బలయ్యేది సామాన్యుడే. ఈ నేపథ్యంలోనే షాద్‌నగర్‌లో బయటపడిన ఉదంతం..మూడు రోజుల్లో డ్యూటీకి వెళ్లిపోవచ్చు! ఈ ఒక్క మాట నమ్మి వెళ్లిన ఓ వ్యక్తి నెలల తరబడి మంచానికే పరిమితమయ్యాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి లక్షన్నర రూపాయలు ధారపోయాల్సి వచ్చింది. పరమేశ్వర థియేటర్ సమీపంలోని దాదాజీ క్లినిక్ చుట్టూ అలుముకున్న తీవ్ర ఆరోపణలు ఇప్పుడు షాద్‌నగర్ పట్టణాన్ని కుదిపేస్తున్నాయి.

• మొలల ఆపరేషన్…మరుసటి రోజే ఇన్ఫెక్షన్…ఆపై నరకం!..

షాద్‌నగర్‌కు చెందిన రచయిత సందీప్ ఆరోపణల ప్రకారం, ఆయన మొలల సమస్యతో దాదాజీ క్లినిక్‌ను ఆశ్రయించారు. మూడు రోజుల్లోనే విధులకు హాజరు కావచ్చు అని చెప్పి రూ.25 వేలు తీసుకున్నారని, ఆపై ఒక చిన్న గదిలో స్థానిక మత్తుమందు ఇచ్చి శస్త్రచికిత్స చేశారని ఆయన ఆరోపించారు.

తర్వాత జరిగింది భయంకరం. మరుసటి రోజు నుంచే ఇన్ఫెక్షన్ సోకి పరిస్థితి విషమించింది. తీవ్ర నొప్పితో తిరిగి క్లినిక్‌కు వెళ్తే సరైన స్పందనే లేదు! చివరకు హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్సకు సుమారు రూ.1.5 లక్షలు ఖర్చు చేస్తే తప్ప కోలుకోలేకపోయారు. నెలల తరబడి మంచానికే పరిమితమై తీవ్ర మానసిక వేదన అనుభవించాను అంటూ సందీప్ వాపోయారు. రూ.25 వేల చౌక చికిత్స చివరకు రూ.1.75 లక్షల భారంగా మారింది. పైగా నెలల తరబడి కోల్పోయిన ఉపాధి, ఆరోగ్యం, మనశ్శాంతి. ఈ నష్టానికి బాధ్యులెవరు?..

• ఇది ఒక్కరి కథ కాదు… బాధితుల వరుస!..

జర్నలిస్ట్ జాంగిలి సురేందర్‌కు ఎదురైన చికిత్స అనుభవం వెలుగులోకి రాగానే, ఇన్నాళ్లూ మౌనంగా భరించిన మరికొందరు బాధితులు గళం విప్పుతున్నారు. కల్వకుర్తికి చెందిన ఓ వ్యక్తికి చికిత్స వికటించడంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిని ఆశ్రయించాల్సి వచ్చిందని చెబుతున్నారు. సమస్యలతో తిరిగి వెళ్లిన రోగులను దురుసుగా మాట్లాడి, బెదిరింపులకు గురిచేస్తున్నారని కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. అన్నింటికంటే భయానకమైన ఆరోపణ ఒకటుంది. 12 నుంచి 13 ఏళ్ల వయసున్న చిన్నారులకు సైతం ఇలాంటి చికిత్సలు చేశారని బాధితులు చెబుతున్నారు. ఇది నిజమైతే వినడానికే గుండె వణికిపోతుంది. ఆడుకునే వయసులో, ఏమీ తెలియని పసివాళ్లపై, ఒక చిన్న గదిలో ఇలాంటి చికిత్సలా? ఈ ఆరోపణను తక్షణమే నిగ్గు తేల్చకపోతే వ్యవస్థ ఉన్నది దేనికి?..

• బోర్డుపై హోమియో…లోపల సర్జరీ.?..

క్లినిక్ నిర్వహిస్తున్న డా. ఎస్. సైదల్లి హోమియోపతి వైద్య అర్హత కలిగి ఉన్నట్లు బోర్డుపై పేర్కొన్నారని బాధితులు చెబుతున్నారు. మరి హోమియోపతి అర్హతతో శస్త్రచికిత్సలు చేయడానికి చట్టం అనుమతిస్తుందా? మత్తుమందులు ఇచ్చి ఆపరేషన్లు చేసేందుకు కావాల్సిన అనుమతులు, శుభ్రత, పరికరాలు, అత్యవసర వైద్య ఏర్పాట్లు ఈ క్లినిక్‌కు ఉన్నాయా? వరుసగా ఇన్ఫెక్షన్లు రావడానికి కారణమేమిటి?

మరో సంచలనాంశం ఏమిటంటే, ఆయన కుమారుడు డా. ఎస్. షాహిద్ ఎంబీబీఎస్ వైద్యుడిగా షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. ప్రైవేటు క్లినిక్ కార్యకలాపాల్లో ఆయన పాత్ర ఏమిటన్నది విచారణలోనే తేలాలి. ప్రభుత్వ వైద్యుడి ప్రమేయం ఉందన్నది బాధితుల ఆరోపణ స్వతంత్ర నిర్ధారణ కావాల్సి ఉంది..

• వైద్య ఆరోగ్య శాఖా… సమాధానం చెప్పండి!..

ఇంతమంది బాధితులు నెలల తరబడి నరకం చూస్తుంటే, ప్రజారోగ్యానికి కాపలా కాయాల్సిన వైద్య ఆరోగ్య శాఖ ఏం చేస్తోంది? షాద్‌నగర్ ప్రజలు ఆగ్రహంతో అడుగుతున్న ప్రశ్నలు.?..

• పట్టణం నడిబొడ్డున, థియేటర్ పక్కనే ఉన్న క్లినిక్‌లో ఇలాంటి చికిత్సలు జరుగుతుంటే ఇన్నాళ్లూ అధికారులకు తెలియలేదా? లేక తెలిసీ చూసీచూడనట్లు వదిలేశారా?..

• ఈ క్లినిక్‌కు రిజిస్ట్రేషన్, అనుమతులు ఉన్నాయో లేదో చివరిసారి ఎప్పుడు తనిఖీ చేశారు? గతంలో ఫిర్యాదులు అందాయా? అందితే ఏం చర్యలు తీసుకున్నారు?..

• బెదిరింపుల ఆరోపణపై శాఖ ఏం చెబుతుంది?..

• ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడి పేరు వినిపిస్తుంటే శాఖ ఎందుకు ఆరా తీయలేదు?..

• ఊరూరా ఉన్న అర్హత లేని క్లినిక్‌లపై క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తున్నారా, లేక ఫిర్యాదు వచ్చినప్పుడే హడావుడి చేస్తున్నారా?

తనిఖీలు చేసి నిబంధనలు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే. అది నిర్వర్తించకపోతే, బాధితుల వేదనలో ఆ నిర్లక్ష్యానికీ వాటా ఉన్నట్లే కదా?..

• ప్రజల డిమాండ్లు..

క్లినిక్‌పై తక్షణ తనిఖీలు, రికార్డులు, పరికరాల స్వాధీనం. స్వతంత్ర, నిష్పాక్షిక విచారణ. ఆరోపణలు నిజమని తేలితే క్లినిక్ మూసివేత, బాధ్యులపై క్రిమినల్ కేసులు. చిన్నారులకు చికిత్స చేశారన్న ఆరోపణపై ప్రత్యేక దర్యాప్తు. ప్రభుత్వ వైద్యుడి ప్రమేయంపై శాఖాపరమైన విచారణ. అర్హత లేని వైద్యులపై జిల్లావ్యాప్తంగా ప్రత్యేక తనిఖీ డ్రైవ్. ఇన్నాళ్లూ చర్యలు తీసుకోని అధికారుల జవాబుదారీతనం. బాధితులకు న్యాయం, నష్టపరిహారం, భద్రత..

• ఇప్పుడు బంతి అధికారుల కోర్టులో!..

బాధితుల గోడు వింటున్నారా? లేక ఇంకో బాధితుడు ఐసీయూకి చేరే వరకు, ఇంకో ప్రాణం పోయే వరకు ఆగుతారా? వైద్య ఆరోగ్య శాఖ మౌనం వీడాల్సిందే. తనిఖీలు ఎప్పుడు? చర్యలు ఎప్పుడు? బాధితులకు న్యాయం ఎప్పుడు? షాద్‌నగర్ ప్రజలు సమాధానం కోసం ఎదురుచూస్తున్నారు…ఈసారి మౌనం చెల్లదు!..