ఖైరతాబాద్ కాక! ఉప ఎన్నిక తప్పదా?

 

ఉప ఎన్నిక తప్పదా?

* కాంగ్రెస్ తో పాటు బిఆర్ఎస్ కు అగ్ని పరీక్ష

* ఎవరు ఓడినా భారీగా మూల్యం

విజేత, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ ఖైరతాబాద్. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై హైకోర్టు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఉంది. కానీ ప్రజా ప్రతినిధుల అనర్హత కేసుల విషయంలో అత్యున్నత న్యాయస్థానం కఠినంగా వ్యవహరిస్తోంది. కఠిన తీర్పులు ఇస్తోంది. ఈ క్రమంలో అక్కడకు వెళ్లినా చుక్కెదురు కావడం ఖాయమేనని ప్రచారం జరుగుతోంది. ఏది ఎలా ఉన్నా ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం ఖాయమని తేలుతోంది. అదే జరిగితే ఆ నియోజకవర్గంలో గెలిచే పార్టీ ఏది? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. కచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీకి సవాల్. అదే సమయంలో గులాబీ పార్టీకి అంతకుమించి సవాల్. ఫలితాలు అటు ఇటు అయితే.. పొలిటికల్ డామేజ్ ఖాయం. ఒక విధంగా చెప్పాలంటే ఆ రెండు పార్టీలకు ఇప్పుడు అగ్ని పరీక్ష.

*దానం చుట్టూ రాజకీయం..*

గత ఎన్నికల్లో దానం నాగేందర్ బిఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచారు. గెలిచిన కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. అయితే గత పది సంవత్సరాలుగా అక్కడ బీఆర్ఎస్ కంటే దానం నాగేందర్ చుట్టూ మాత్రమే రాజకీయం తిరుగుతోంది. ఆ నియోజకవర్గంలో ఆయనకు వ్యక్తిగత చరిష్మ అధికం. ప్రతి డివిజన్లోనూ ఆయనకు వ్యక్తిగత అనుచర గణం ఉంది. పార్టీకి క్షేత్రస్థాయిలో అక్కడ సంస్థాగత బలం లేదు. అందుకే గులాబీ పార్టీ భయపడుతోంది. ఆ పార్టీకి బలమైన అభ్యర్థి కూడా అక్కడ లేరు. ఆ పార్టీకి మైనస్ కూడా అదే. ఒకవేళ అక్కడ నెగ్గుకు రాకపోతే ఆ పార్టీకి చాలా డ్యామేజ్ జరుగుతుంది. అలాగని ఆ పార్టీకి ఇది సువర్ణ అవకాశం. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని ఎక్కువగా పోరాటం చేసింది ఆ పార్టీ. ఇప్పుడు అంది వచ్చిన అవకాశం ఆ పార్టీది. ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. ఒకవేళ ఓడిపోతే మాత్రం ఆ పార్టీకి రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు అధికం.

*మొన్ననే జూబ్లీహిల్స్ లో ఓటమి..*

గత ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో ఎక్కువ స్థానాల్లో గులాబీ పార్టీ విజయం సాధించింది. కానీ గడిచిన రెండేళ్లలో ఆ పార్టీ ప్రభావం ఎంతవరకు ఉంటుందో అనేది అనుమానం. ఎందుకంటే అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చి ఆదరిస్తారు నగర ప్రజలు. ఇక్కడ సెంటిమెంట్ తో పని ఉండదు. జూబ్లీహిల్స్ నుంచి గులాబీ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు మాగంటి గోపీనాథ్. ఆయన ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులనే రంగంలోకి దించింది బీఆర్ఎస్. కానీ అక్కడ సానుభూతి వర్కౌట్ కాలేదు. అధికార పార్టీ వైపే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు మొగ్గు చూపారు. అందుకే గులాబీ పార్టీ ఎక్కువగా భయపడుతోంది. ఉప ఎన్నికల్లో గెలుపు అంత ఈజీ కాదని భావిస్తోంది. దానం నాగేందర్ వ్యక్తిగత ప్రభావానికి తోడు అధికార యంత్రాంగం సహకరిస్తే నెగ్గుకు రాలేమని అంచనా వేస్తోంది.

*కాంగ్రెస్ గెలవక తప్పదు..*

మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ఇది పెను సవాల్. కచ్చితంగా ఈ స్థానాన్ని గెలిచి తీరాలి. లేకుంటే ప్రభుత్వ సుస్థిరతకు ఇది కచ్చితంగా ప్రమాదం చేకూరే అంశం. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఇతర ప్రత్యర్ధులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే బైపోల్లో మరోసారి దానం నాగేందర్ ను బరిలో దించుతారా? లేకుంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పీజేఆర్ కుమార్తె విజయ రెడ్డితో పోటీ చేయిస్తారా? అనేది చూడాలి. గతంలో ఉప ఎన్నికల్లో దానం నాగేందర్ ఓడిపోయిన పరిస్థితి ఉంది. అదే సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని దానం నాగేందర్ ను మార్చితే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ గెలిస్తే రేవంత్ సర్కార్ కు మరింత సుస్థిరత ఖాయం. లేకుంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనట్టే.