
– ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే అమలు చేయాలి
– జాబ్ క్యాలెండర్ కోసం యువత డిమాండ్
– నిరుద్యోగ భృతి ఇవ్వాలి
– కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై సత్తుపల్లి లో నిరసన
విజేత, సత్తుపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వ పాలనా వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సత్తుపల్లి పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, నిరుద్యోగ యువతతో పాటు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా వాటిలో చాలా హామీలు అమలు కాలేదని ఆరోపించారు. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, నిరుద్యోగ యువతకు నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి అందిస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు.అలాగే ప్రతి సంవత్సరం 25 వేల ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందిస్తామని, యువత కోసం యూత్ కమిషన్ ఏర్పాటు చేసి ఆర్థిక సహాయం అందిస్తామని చేసిన హామీలను అమలు చేయాలని కోరారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్య కొనసాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాలేజీ యాజమాన్యాలకు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులపై ఫీజుల కోసం ఒత్తిడి పెరుగుతోందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ తదితర వర్గాలకు చెందిన పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.విద్యారంగంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంతో పాటు విశ్వవిద్యాలయాలకు తగినన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు.పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. జీవో నంబర్ 9కు సంబంధించిన అంశాలను పునఃపరిశీలించి పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.రానున్న అసెంబ్లీ సమావేశాల్లో విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ వంటి అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కూసంపూడి మహేష్, బెల్లంకొండ రాము, బీఆర్‌ఎస్ నాయకులు అయూబ్ పాషాతో పాటు పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.









