
– వర్షాభావ పరిస్థితులపై మంత్రివర్గం ఆందోళన
– తాగునీరు, సాగునీటికి ప్రత్యేక కార్యాచరణ
– ధరణి అక్రమాలపై ప్రత్యేక విచారణ బృందం
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం
విజేత,హైదరాబాద్, ప్రతినిధి : ఎల్‌నినో ప్రభావం, రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితుల తీవ్రతను కేంద్ర ప్రభుత్వానికి వివరించి ప్రత్యేక సహాయం కోరాలని నిర్ణయించింది. వర్షాభావం వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపించాలని, ప్రత్యామ్నాయ ప్రణాళికల అమలుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని మంత్రివర్గం తీర్మానించింది. రాష్ట్రంలో తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రివర్గం ఆదేశించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ సాధారణ వర్షపాతం నమోదు కాలేదని, చాలా చోట్ల 30 నుంచి 35 శాతానికి మించి వర్షపాతం లేకపోవడంతో ముందస్తు కార్యాచరణను సిద్ధం చేయాలని సూచించింది. ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యంగా వినియోగించాలని, రైతులు తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు అవసరమైన సమాచారం, సలహాలు అందించేందుకు ప్రజాభవన్‌లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో టోల్‌ఫ్రీ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేసే ఈ హెల్ప్‌లైన్‌కు 1-800-123-7157 నంబర్‌ను అందుబాటులో ఉంచింది. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్లు వెంటనే స్పందించాలని, తాగునీరు, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వర్షాభావ పరిస్థితులపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నెల 20న ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, నిపుణులు, శాస్త్రవేత్తలతో సమావేశాలు నిర్వహించి జిల్లాల వారీగా పరిస్థితులు, పంట నష్టాలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని నిర్ణయించింది. అలాగే రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ నిపుణులతో ఎల్‌నినో ప్రభావంపై ప్రత్యేక అధ్యయన నివేదిక రూపొందించాలని సూచించింది.మంత్రిమండలి సమావేశంలో ధరణి పోర్టల్‌కు సంబంధించిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ధరణి టెండర్ ప్రక్రియ నుంచి ప్రారంభించి, 2020 అక్టోబర్ 29 నుంచి ఇప్పటి వరకు జరిగిన భూముల రిజిస్ట్రేషన్లు, రికార్డుల మార్పులు, వ్యవసాయ, అసైన్డ్, ప్రభుత్వ భూముల బదలాయింపులు సహా అన్ని అనుమానాస్పద లావాదేవీలను లోతుగా విచారించాలని నిర్ణయించినట్లు మంత్రులు వెల్లడించారు. సామాజిక, పరిపాలనా సంస్కరణలకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్జెండర్లను సహనియమిత సభ్యులుగా నామినేట్ చేసేలా తెలంగాణ మున్సిపాలిటీల చట్టం–2019లో సవరణకు, గ్రామ పంచాయతీ నిధులను జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో జమ చేసుకునేలా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లో సవరణకు ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రివర్గ నిర్ణయాలను మీడియాకు వివరించారు.





