
*బండ్లగూడలో భూ వివాదం అర్ధరాత్రి జేసీబీతో ప్రహరీ కూల్చివేత*
*మాజీ మేయర్ బుర్ర మహేందర్ గౌడ్ సోదరులపై ఆరోపణలు*
*మాజీ వార్డు మెంబర్ నాగుల నరేందర్ కుటుంబం ఆవేదన*
విజేత,రాజేంద్రనగర్ : బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అభ్యుదయ నగర్ కాలనీలో భూ వివాదం చెలరేగింది. మాజీ మేయర్ బుర్ర మహేందర్ గౌడ్ సోదరులు తమ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించి ప్రహరీ, గదిని కూల్చివేశారని మాజీ వార్డు మెంబర్ కుటుంబం ఆరోపిస్తోంది.
*తెల్లవారుజామున కూల్చివేత*
అభ్యుదయ నగర్ కాలనీ సర్వే నంబర్ 48, 49లో ఉన్న 267 గజాల స్థలాన్ని నాలుగేళ్ల క్రితం జే.ముకుంద ఆనంద్ వద్ద నుంచి తమ కుటుంబం కొనుగోలు చేసిందని కార్పొరేటర్ నాగుల స్రవంతి భర్త, మాజీ వార్డు మెంబర్ నాగుల నరేందర్ తెలిపారు. అయితే ఈ స్థలం తమదేనంటూ మాజీ మేయర్ బుర్ర మహేందర్ గౌడ్ సోదరులు ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో జేసీబీ తీసుకువచ్చి ప్రహరీ గేటు, గదిని నేలమట్టం చేశారని ఆరోపించారు.
*ఇదెంతవరకు సమంజసం*
మేము చట్టప్రకారం డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన స్థలంలోకి అక్రమంగా వచ్చి కూలగొట్టడం ఎంతవరకు సమంజసం?” అని నాగుల నరేందర్ నిలదీశారు. నార్సింగి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు పూర్తయ్యాయని తెలిపారు.

*గతంలోనూ వివాదం*
రిజిస్ట్రేషన్ సమయంలోనే ల్యాండ్ ఓనర్లు అంటూ కొందరు అడ్డుకున్నారని, అయితే ఎస్ఆర్ఓ తన పని తాను చేశాడని నరేందర్ వాపోయారు. ఈ స్థల వివాదంపై గతంలో నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసులు కూడా నమోదయ్యాయని చెప్పారు.
*పోలీసులకు ఫిర్యాదు*
తెల్లవారుజామున జేసీబీతో వచ్చి కూల్చివేతకు పాల్పడటంపై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధిత కుటుంబం తెలిపింది. రాజకీయ అండదండలతోనే ఇలా అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.








