
తాము విలేకరులమని చెప్పి లారీ డ్రైవర్‌ను బెదిరించి రూ.1.20 లక్షలు డిమాండ్
విజేత,కామారెడ్డి జిల్లా ప్రతినిధి: పిర్యాదు దారుడు చకినాల సురేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, 26.09.2026 రాత్రి వడ్ల లోడ్‌తో వెళ్తున్న లారీని మల్లయ్యపల్లి గ్రామ శివారులో అడ్డగించి, తాము విలేకరులమని చెప్పి లారీ డ్రైవర్‌ను బెదిరిస్తూ రూ.1.20 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఈ ఫిర్యాదుపై ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాసరావు పర్యవేక్షణలో, ఎల్లారెడ్డి సీఐ, ఎస్‌ఐల ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు వివరాల్లోకి వెళ్తే. 26.09.2026 రాత్రి మల్లయ్యపల్లి గ్రామ శివారులోని పోచారం కెనాల్ సమీపంలో లారీ నంబర్ TS05UD4689ను వ్యాగనర్ కారుతో అడ్డగించిన నిందితులు, లారీలోని వడ్లకు సంబంధించిన పత్రాలు చూపించాలని డ్రైవర్‌ను కోరారు. పత్రాలు చూపించకపోతే నలుగురికి ఒక్కొక్కరికి రూ.30,000 చొప్పున మొత్తం రూ.1,20,000 ఇవ్వాలని డిమాండ్ చేసి, డబ్బులు ఇవ్వకపోతే చంపుతామని, పోలీసులకు పట్టించి కేసులు పెట్టిస్తామని బెదిరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
నిందితుల వివరాలు:
1. మహమ్మద్ అబ్దుల్ మోసిన్ (27), తండ్రి: మహమ్మద్ నయీమ్ R/o బాన్సువాడ. వృత్తి: బతుకమ్మ ప్రింట్ మీడియా రిపోర్టర్.
2. ఎడ్ల మహేష్ కుమార్, తండ్రి: గంగారం R/o బాన్సువాడ. వృత్తి: జనహితం ఈ-పేపర్ & M-2 న్యూస్ యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్.
3. బుద్దే ఆనంద్, తండ్రి: సాయిలు R/o మీర్జాపూర్ గ్రామం. వృత్తి: జనసాక్షిక ఈ-పేపర్ రిపోర్టర్.
4. గాండ్ల సుధీర్ కుమార్, తండ్రి: సుభాష్, R/o బాన్సువాడ. వృత్తి: మనం న్యూస్ పేపర్ స్టాఫ్ రిపోర్టర్.
దర్యాప్తులో నిందితులను గుర్తించి అరెస్టు చేసిన పోలీసులు, వారి వద్ద నుంచి నేరానికి ఉపయోగించినట్లు వ్యాగనర్ కారు, 4 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చాకచక్యంగా దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించి అరెస్టు చేసిన ఎల్లారెడ్డి పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు. వృత్తి లేదా హోదాను అడ్డుపెట్టుకుని చట్టాన్ని ఉల్లంఘించినా, నేరాలకు పాల్పడే వ్యక్తులు చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకోలేరని తెలిపారు. కేసుకు సంబంధించిన మిగిలిన అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాసరావు తెలిపారు.








