
– జగిత్యాలఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
విజేత,రాయికల్: పేదల సంక్షేమం, సామాజిక న్యాయం, గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ మండలం సింగరావుపేటలో లో వోల్టేజీ సమస్య పరిష్కారానికి ఏర్పాటు చేసిన 100 కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం కొత్తపేట గ్రామంలో సయ్యద్ హసీనా బేగం–అహ్మద్ దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు వాతావరణ శాఖ సూచనలను పాటిస్తూ పంటల సాగులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్‌కు డిమాండ్ పెరిగినప్పటికీ ప్రజలకు నిరంతర సరఫరా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో పేద కుటుంబాలకు ప్రయోజనం కలుగుతోందని తెలిపారు. అర్హులైన అన్ని వర్గాల వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని, కులగణన ద్వారా సామాజిక న్యాయానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధితోపాటు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కల నెరవేరుతోందని, అర్హులైన వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.కార్యక్రమాల్లో ఆత్మ చైర్మన్ కాటిపెల్లి గంగారెడ్డి, సర్పంచులు కృష్ణమూర్తి, మీనుగు గంగ అంజయ్య, పీఏసీఎస్ చైర్మన్లు తంగెళ్ల రమేష్, శేఖర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఏనుగు మల్లారెడ్డి, ఎంపీడీవో చిరంజీవి, ఏఈడీ సింధుర్ శర్మ, ఏఈ నవీన్, కోల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ రాము, రవి గౌడ్, సాయి రెడ్డి, ఉపసర్పంచ్ రంజిత్, మాజీ ఎంపీటీసీ మందుల శ్రీనివాస్, కరీం, రమేష్, సురేందర్ నాయక్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి ముకీద్, తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.








