మదర్సా కమిటీపై రాజకీయ నీడ!

– నూతన కమిటీ ఏర్పాటులో జాప్యానికి బీఆర్‌ఎస్‌ నేతే కారణమా?

– కమిటీ కాలపరిమితి ముగిసి నెల రోజులు

– ఎన్నికపై స్పష్టత కరువు

– ఆదాయ–వ్యయాలు, దుకాణాల అద్దెలపై పారదర్శకత కోరుతున్న ముస్లిం వర్గాలు

విజేత, సత్తుపల్లి: సత్తుపల్లి పట్టణంలోని ఉర్దూ అరబిక్ మదర్సా దారుల్ ఉలూమ్ మహమ్మదీయ నిర్వహణ కమిటీ కాలపరిమితి ముగిసి నెల రోజులు కావస్తున్నా.. నూతన కమిటీని ఏర్పాటు చేయకపోవడంపై ముస్లిం వర్గాల్లో చర్చ జరుగుతోంది. కమిటీ ఎన్నిక ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

జాప్యంపై రాజకీయ ప్రభావం ఉందా?

నూతన నిర్వహణ కమిటీ ఏర్పాటులో పట్టణానికి చెందిన ఓ మైనారిటీ బీఆర్‌ఎస్‌ నాయకుడి ప్రభావం ఉందనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. సదరు నాయకుడి కనుసన్నల్లోనే కమిటీ ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగడం లేదని కొందరు ముస్లిం వర్గాల వారు చర్చించుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి సంబంధిత నాయకుడి అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది. కమిటీ ఎన్నికలో జాప్యానికి అసలు కారణం ఏమిటన్నది నిర్వాహకులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది.

ఆదాయ–వ్యయాలపై ప్రశ్నలు

పేద ముస్లిం విద్యార్థులకు ఉచితంగా ధార్మిక విద్య అందించేందుకు కొనసాగుతున్న మదర్సా నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని స్థానికులు కోరుతున్నారు. మదర్సాకు సంబంధించిన ఆదాయ–వ్యయాలు, దుకాణాల అద్దెలు తదితర వ్యవహారాలపై పూర్తి వివరాలను నూతన కమిటీ సమక్షంలో పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో మదర్సా నిర్వహణపై కొన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ వాటిపై స్పష్టమైన వివరణ ఇవ్వలేదని కొందరు పేర్కొంటున్నారు.కమిటీ కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో వెంటనే నూతన నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసి ఎన్నికల తేదీని ప్రకటించాలని ముస్లిం వర్గాలు కోరుతున్నాయి. మదర్సా ఆదాయ–వ్యయాలు, దుకాణాల అద్దెలు తదితర అంశాలపై స్పష్టత ఇవ్వడంతో పాటు ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.కమిటీ ఎన్నికపై అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుంది? జాప్యానికి కారణం ఏమిటి? ఆరోపణలపై సంబంధిత నాయకులు, మదర్సా నిర్వాహకులు ఎలాంటి వివరణ ఇస్తారన్నది వేచి చూడాల్సి ఉంది.