
పగటిపూటే తెగబడ్డ దండగులు.. నడిరోడ్డుపై యువకుడి వేట.. కత్తులు, కారంతో రాక్షసకాండ
విజేత,రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్ నియోజకవర్గ మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ మూకల గర్జనలతో, నెత్తుటి మరకలతో వణికిపోతోంది. శాంతిభద్రతలు గాల్లో కలిసిపోయాయి. ఉదయం జరిగిన ఓ హత్య ఘటన మరువకముందే.. కనీసం 12 గంటలు కూడా గడవకముందే అదే ప్రాంతంలో మరో యువకుడు నడిరోడ్డుపై అతి దారుణంగా హత్యకు గురయ్యాడు. వరుస హత్యలతో స్థానికులు భయాందోళనలతో గజగజ వణికిపోతున్నారు.
కళ్లలో కారం.. కత్తులతో వేట
పోలీసుల సమాచారం మేరకు.. అబ్దుల్ రవూఫ్ అనే యువకుడు వెళ్తుండగా, ముందస్తు ప్రణాళికతో వేచి చూస్తున్న దుండగులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. బాధితుడు తేరుకునే లోపే కళ్లలో కారం కొట్టి, రక్షణ లేకుండా చేశారు. ఆ తర్వాత కత్తులతో సింహాల్లా విరుచుకుపడి, దేహాన్ని ఛిద్రం చేస్తూ కిరాతకంగా నరికి చంపారు. రక్తం మడుగులో అబ్దుల్ రవూఫ్ ప్రాణాలు వదిలినంత వరకు ఆ రాక్షసకాండ సాగింది. ఘటన అనంతరం దుండగులు ఆయుధాలతో అక్కడికక్కడే పరారయ్యారు.
పోలీసులకు సవాల్.. ఆందోళనలో ప్రజలు
సమాచారం అందుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని, నిందితుల కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.అయితే, ఒకే రోజు 12 గంటల వ్యవధిలో రెండు దారుణ హత్యలు జరగడం చట్టం, పోలీసు వ్యవస్థపై దుండగులకు భయం లేదనడానికి నిదర్శనమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ వరుస హత్యల వెనుక ఉన్న ముఠా ఎవరు? పాత కక్షలా? లేక మరేదైనా గ్యాంగ్ వార్ ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.









