
– కాంగ్రెస్ దాడులను ఖండిస్తూ సత్తుపల్లిలో నిరసన
– ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
విజేత, సత్తుపల్లి: దాడులతో బీజేపీ నాయకులను , కార్యకర్తలను భయపెట్టలేరని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం, నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడి నివాసంపై దాడి చేయడం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు అరెస్టును నిరసిస్తూ సత్తుపల్లి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.రాష్ట్ర అధికార ప్రతినిధి నంబూరి రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల కార్యాలయాలు, నాయకులు, కార్యకర్తలపై దాడులకు ఎలాంటి స్థానం లేదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలపై దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, యువత, ఉద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదన్నారు.
“ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? హామీల అమలుపై నిలదీస్తే కేసులు పెడతారా? బీజేపీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే అది కాంగ్రెస్ ప్రభుత్వ భ్రమ మాత్రమే” అని అన్నారు. ప్రజల తరఫున బీజేపీ మరింత బలంగా పోరాడుతుందని స్పష్టం చేశారు.









