తరిగొప్పుల మండల బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

విజేత,తరిగొప్పుల / జనగామ : బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.టి. రామారావు కన్నెపల్లిలో నిర్వహించనున్న పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్న నేపథ్యంలో, తరిగొప్పుల మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు మరియు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తరిగొప్పుల మండల బిఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులను తెల్లవారు జామునే పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేటీఆర్ పర్యటనను అడ్డుకోవడానికే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ అరెస్టులకు పాల్పడుతోందని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నారని అరెస్టయిన బిఆర్ఎస్ నాయకులు ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకుల ముందస్తు అరెస్టులతో మండలంలోని బిఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి, నిరసనలు వ్యక్తమవుతున్నాయి.అరెస్టయిన వారిలో తరిగొప్పుల మండల బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు పింగిళి జగన్మోహన్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ జుమ్లాల్ ,మాజీ వైస్ ఎంపీపీ చెన్నూరి సంజీవులు , మాజీ సర్పంచ్ సిద్ధిని మహిపాల్, గ్రామ శాఖ నాయకులు అంకం రాజారాం , జిల్లా నాయకులు ఏడేళ్లి శ్రీనివాస్ రెడ్డి ,
బుస యాదయ్య తదితరులు ఉన్నారు.