బద్రీనాథ్ ఆలయంలో కలకలం..! విరాళాలపై విచారణ ఆరోపణలపై కమిటీ

బద్రీనాథ్ ఆలయంలో కలకలం..!

విరాళాలపై విచారణ ఆరోపణలపై కమిటీ

విజేత,డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయంలో భక్తులు సమర్పించిన విరాళాల నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. సామాజిక మాధ్యమాల్లో ఈ అంశంపై విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బద్రీనాథ్–కేదార్‌నాథ్ ఆలయ కమిటీ అధికారిక విచారణకు ఆదేశించింది. ఆరోపణలపై నిజానిజాలు వెలికితీసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఆలయ కమిటీ అధ్యక్షుడు హేమంత్ ద్వివేది మాట్లాడుతూ.. భక్తులు సమర్పించిన కానుకల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. పారదర్శకంగా విచారణ నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తామని చెప్పారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసి వివరణ కోరినట్లు వెల్లడించారు. విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ అన్ని ఆధారాలను పరిశీలించనుంది. విరాళాల లెక్కలు, కానుకల నిర్వహణ విధానం, సంబంధిత ఉద్యోగుల బాధ్యతలు తదితర అంశాలపై సమగ్రంగా విచారణ చేపట్టనున్నారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని ఆలయ కమిటీ హెచ్చరించింది.సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న మరో అంశంపై కూడా హేమంత్ ద్వివేది స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగి తన వ్యక్తిగత కార్యదర్శి అనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. తనకు వ్యక్తిగత కార్యదర్శి ఎవరూ లేరని, ఆ ఉద్యోగి ఆలయ కమిటీలో సాధారణ సిబ్బందిగా మాత్రమే పనిచేస్తున్నాడని తెలిపారు. గత ముగ్గురు కమిటీ అధ్యక్షుల హయాంలో కూడా అతడే విధులు నిర్వహించినట్లు పేర్కొన్నారు.విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్ణయాలకు రావద్దని, నిర్ధారణ కాని సమాచారాన్ని నమ్మి అపోహలకు గురికావద్దని భక్తులకు ఆలయ కమిటీ విజ్ఞప్తి చేసింది. అధికారిక విచారణ నివేదిక వెలువడిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది. బాధ్యులెవ్వరైనా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇటీవల దేశంలోని పలు ప్రముఖ దేవాలయాల విరాళాల నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో బద్రీనాథ్ ఆలయంలో వచ్చిన ఈ ఆరోపణలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ప్రస్తుతం ఇవి ఆరోపణల దశలో మాత్రమే ఉన్నాయని, విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్ణయాలకు రావద్దని ఆలయ కమిటీ మరోసారి స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :