
విజేత,ఎడిటర్ డా. బి.అనిల్ కుమార్ : చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఇప్పుడు తన రాజకీయ ప్రయాణంలో అత్యంత కీలకమైన సవాలును ఎదుర్కొంటున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఆ పార్టీతో తెగదెంపలు చేసుకుని సొంత రాజకీయం మొదలుపెట్టారు.వచ్చే ఏడాది మార్చితో ముగియనున్న తన పదవీకాలం ముగిసేలోపు మళ్లీ అదే స్థానం నుంచి స్వతంత్ర వేదిక ద్వారా గెలవాలనే లక్ష్యంతో సుదీర్ఘ పాదయాత్రకు రూపకల్పన చేస్తున్నారు. ఈ కొత్త నిర్ణయం ఆయన భవిష్యత్తును పూర్తిగా మార్చే అవకాశం ఉంది.గతానికి ఇప్పటికి మల్లన్న పొలిటికల్ ఇమేజ్‌లో చాలా స్పష్టమైన మార్పు వచ్చింది. ఒకప్పుడు తీన్మార్ మల్లన్న అంటే డిజిటల్ మీడియా ద్వారా ప్రభుత్వాలను అక్రమాలను ప్రశ్నించే హార్డ్‌కోర్ వాయిస్‌గా యూత్‌లో విశేషమైన ఆదరణ ఉండేది. ఆ ప్లాట్‌ఫామ్ తెచ్చిపెట్టిన క్రేజ్‌తోనే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడే లక్షలాది ఓట్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తదనంతరం కాంగ్రెస్‌లో చేరి ప్రత్యర్థులను తట్టుకుని ఎమ్మెల్సీ పీఠాన్ని అధిరోహించగలిగారు. కానీ కాలక్రమేణా ఆయన అనుసరించిన విధానాలు మారడంతో ప్రజల్లో ఆయనపై ఉన్న సానుకూల దృక్పథం నెమ్మదిగా కరిగిపోతూ వచ్చింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఆయన ఎంచుకున్న రాజకీయ దారి ఆయన పునాదులనే కదిలించిందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. బీసీ ఐక్యత పేరుతో కొన్ని వర్గాలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఇతర కులాలను సమాజంలోని కొన్ని విభాగాలను తీవ్రంగా విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ చర్యలు ఆయనకున్న న్యూట్రల్ ఎడ్యుకేటెడ్ ఓటర్ బేస్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. విద్యావంతులు గ్రాడ్యుయేట్లు ఓటేసే ఎమ్మెల్సీ నియోజకవర్గంలో వ్యక్తిగత దూషణల కంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు.ఈ క్రమంలో మల్లన్న తన పాత ఇమేజ్‌ను పోగొట్టుకుని దారి తప్పిన నాయకుడిగా మిగిలిపోయారనే విమర్శలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలం ఓటు బ్యాంకు అండగా ఉండవు. ప్రధాన పార్టీలు ఈ విస్తృత నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు క్షేత్రస్థాయి నుంచి పక్కా వ్యూహాలు అమలు చేస్తున్నాయి. కాంగ్రెస్ వైపు నుంచి అధికారిక అభ్యర్థి బరిలో ఉంటారు కాబట్టి పోటీ మరింత తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి త్రిముఖ లేదా చతుర్ముఖ పోరులో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ లేకుండా కేవలం సొంత ఇమేజ్‌తో బరిలోకి దిగడం పెద్ద సాహసమే. అందుకే పాదయాత్ర ద్వారా మళ్లీ జనం లోకి వెళ్లి కోల్పోయిన నమ్మకాన్ని పునరుద్ధరించుకోవాలని ఆయన తీవ్రంగా భావిస్తున్నారు. పాదయాత్రలు చేయడం తేలికే అయినా పట్టభద్రుల మైండ్ సెట్‌ను మార్చడం మల్లన్నకు అంత సులభం కాకపోవచ్చు. ఒకవేళ పాదయాత్ర చేసినా కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఓట్లు సాధించలేకపోతే గత కొన్నేళ్లుగా ఆయన చుట్టూ ఉన్న పొలిటికల్ హడావుడి ప్రసహనంలా మారుతుంది. తన పాత ఇమేజ్‌ను తిరిగి తెచ్చుకుని విద్యావంతులను మెప్పించే సరైన అజెండాతో వస్తే తప్ప రాబోయే ఎన్నికల పోరు ఆశాజనకంగా ఉండే అవకాశం లేదు. లేకపోతే ఆయనను పట్టించుకునే వారే కరువవుతారు.







