*విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించాలి*
*శంషాబాద్ మండలంలోని 9 గ్రామాలకు నేటికీ బస్సు సౌకర్యం లేదు*.
*ప్రజా సమస్యల పరిష్కారానికి మీరు చొరవ తీసుకోవాలని శ్రీనివాస్ రెడ్డిని కోరారు గ్రామస్తులు*
విజేత,రాజేంద్రనగర్ :
శంషాబాద్ మండల పరిధిలోని శంకరాపురం గ్రామంతో పాటు పరిసర గ్రామాలకు తక్షణమే ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు . రాజేంద్రనగర్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి తోకల శ్రీనివాస్ రెడ్డి కలిసి తమ సమస్యలను వివరించారు. శంకరాపురం, పెద్ద గోల్కొండ, బహదూర్, అమీదుల్లానగర్, ఘన్స్ మియా, సంఘీగూడ, బురుజుగడ్డ తండా, షాపూర్ తండా తదితర గ్రామాలకు చెందిన ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో మంగళవారం శ్రీనివాస్ రెడ్డి కి తమ గోడును వినిపించారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంత గ్రామాలకు సరైన బస్సు సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ప్రత్యేకించి పాలమాకుల మోడల్ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందన్నారు. ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యం లేక ట్రాక్టర్లు, డీసీఎంలు, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో ఈ ఇబ్బందులు మరింత పెరిగి విద్యార్థుల భద్రతకు ముప్పుగా మారుతున్నాయని పేర్కొన్నారు.పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు ప్రతిరోజూ ఆటోలు ఏర్పాటు చేసి పిల్లలను పాఠశాలకు పంపే ఆర్థిక స్థోమత లేదని తెలిపారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు సమయానికి పాఠశాలకు చేరుకోలేక చదువులో వెనుకబడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పారు.ఈ సమస్యపై పలుమార్లు స్థానిక ప్రజాప్రతినిధులు.సంబంధిత అధికారులను కలిసి వినతిపత్రాలు అందజేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు వాపోయారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మీరు చొరవ తీసుకోవాలని శ్రీనివాస్ రెడ్డిని కోరారు.గ్రామస్తుల సమస్యలను ఓపికగా విన్న తోకల శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ సమస్యను అత్యంత ప్రాధాన్యతతో తీసుకుంటానన్నారు. త్వరలోనే ఆర్టీసీ అధికారులతో పాటు ఉన్నతస్థాయి అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి. సంబంధిత గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించేలా అవసరమైన చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, విద్యార్థులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
