*పీరంచెరులో ప్రజాధనంతో ‘ప్రత్యేక రోడ్లు’ - అధికారుల తీరుపై అనుమానాలు*
*రూ.59 లక్షల సీసీ రోడ్డు మధ్యలోనే కరెంటు స్తంభం - ఫంక్షన్ హాల్‌కు లబ్ధి చేకూర్చేందుకేనా అంటున్న స్థానికులు*
*అంతా నా ఇష్టం అంటూ వ్యవహరిస్తున్న డిఈ యాదయ్య*
విజేత,రాజేంద్రనగర్ : ప్రజల సొమ్ముతో నిర్మించే రోడ్లు ప్రజలకా.. ప్రైవేట్ ఫంక్షన్ హాళ్లకా? అనే ప్రశ్న బండ్లగూడ జాగిర్లో వినిపిస్తోంది. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బండ్లగూడ జాగిర్ పీరంచెరు డివిజన్లో 21లో రూ.59 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు పనులు అధికారుల లాలూచీకి నిదర్శనంగా నిలుస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
*రోడ్డు మధ్యలోనే విద్యుత్ స్తంభం*
ప్రైవేట్ ఫంక్షన్ హాళ్ల వద్ద ప్రజాధనం రూ.59 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయితే రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని తొలగించకుండానే పనులు పూర్తిచేశామని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆ రోడ్డు వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. ప్రజల భద్రతను గాలికొదిలేశారని స్థానికులు మండిపడుతున్నారు.

*బిల్లుల కోసమే హడావుడా?*
స్తంభాన్ని తొలగించకుండా, షిఫ్ట్ చేయకుండా రోడ్డు వేయడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కేవలం బిల్లులు క్లియర్ చేసుకోవడం కోసమే పనులు పూర్తయినట్లు చూపించారా? లేక ఫంక్షన్ హాల్ యాజమాన్యానికి లబ్ధి చేకూర్చేందుకు నిధులు మళ్లించారా? అని నిలదీస్తున్నారు. ఎవరి మెప్పు కోసం ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేశారో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.
*విజిలెన్స్ విచారణకు డిమాండ్*
రోడ్డు మధ్యలో స్తంభం ఉండటంతో నిత్యం ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, సంబంధిత విద్యుత్, జీహెచ్ఎంసీ శాఖలు స్పందించకపోవడం ప్రశ్నార్థకంగా మారిందని వాపోతున్నారు. అంతా నా ఇష్టం అంటూ వ్యవహరిస్తున్న డిఈ యాదయ్య పై పూర్తిస్థాయిలో విజిలెన్స్ విచారణ జరిపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగంపై ఉన్నతాధికారులు విద్యుత్ శాఖ అధికారులు స్పందించి వెంటనే స్తంభాన్ని తొలగించి ప్రమాదాలు నివారించాలని కోరుతున్నారు.