బంగాళాఖాతంలో అల్పపీడనం
రాష్ట్రంలో రెండ్రోజులు అతిభారీ వర్షాలు!
పలు జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’
ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలుల హెచ్చరిక
ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచన
విజేత,హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు మళ్లీ ఊపందుకున్నాయి. రాగల రెండ్రోజుల పాటు (ఆగస్టు 24, 25 తేదీల్లో) తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ప్రభావిత జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ హెచ్చరికలు జారీ చేసింది.
*ఆ జిల్లాల్లో విస్తారంగా వానలు*
వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. వీటితో పాటు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ సహా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షం సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
*హైదరాబాద్‌లో మేఘావృతం.. జల్లులు*
రాజధాని హైదరాబాద్ పరిసరాల్లో ఆకాశం రోజంతా మేఘావృతమై ఉంటుందని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 30 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే సూచనలున్నాయి. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకల సమీపంలో ఉండే వారు మరింత జాగ్రత్తగా ఉంటూ అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు.