అసౌకర్యాల మధ్య అంగన్వాడీ కేంద్రాలు
అంగన్వాడి టీచర్లు 6, ఆయా పోస్టులు13 ఖాళీ..
అదనపు బాధ్యతలతో సిబ్బందిపై పనిభారం
విజేత,చొప్పదండి: చొప్పదండి మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్,ఆయా పోస్టులను నిబంధనల ప్రకారం భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. సిబ్బంది కొరతతో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని,ఉన్న సిబ్బందిపైనే అదనపు బాధ్యతలు పడుతున్నాయని పేర్కొంటున్నారు.చిన్నారులకు పౌష్టికాహారం,ప్రాథమిక విద్య,గర్భిణులు,బాలింతలకు అందించాల్సిన సేవలు సక్రమంగా కొనసాగేందుకు సరైనసిబ్బందినినియమించాలని కోరుతున్నారు.
చొప్పదండి మండలం లో 46 కేంద్రాలు భవనాల వివరాలు
చొప్పదండి పరిధిలో మొత్తం 46 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి.వీటిలో 14 కేంద్రాలు సొంత భవనాల్లో, 8 కేంద్రాలు అద్దె భవనాల్లో,మరో 24 కేంద్రాలు అద్దె చెల్లించాల్సిన అవసరం లేని భవనాల్లో కొనసాగుతున్నాయి. కేంద్రాల సంఖ్యకు అనుగుణంగా సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో నిర్వహణపరమైన సమస్యలు తలెత్తుతున్నట్లు సమాచారం.
19 పోస్టులు ఖాళీ
అంగన్వాడీ కేంద్రాల్లో 6 టీచర్ పోస్టులు,13 ఆయా పోస్టులు కలిపి మొత్తం 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.ఖాళీలను భర్తీ చేయకపోవడంతో పనిచేస్తున్న సిబ్బందిపై అదనపు భారం పడుతోంది.కొన్ని కేంద్రాల్లో సిబ్బంది కొరత కారణంగా ఒక కేంద్రం బాధ్యతలను మరో సిబ్బందికి అప్పగిస్తున్నట్లు చెబుతున్నారు.
పిల్లలకు ఒకచోట.. గర్భిణులకు మరోచోట భోజనం..
సిబ్బంది కొరత కారణంగా కొన్ని చోట్ల చిన్నారులకు ఒక కేంద్రంలో,గర్భిణులు, బాలింతలకు మరో కేంద్రంలో భోజన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.దీనివల్ల లబ్ధిదారులకు సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతో పాటు, ప్రతి అంగన్వాడీ కేంద్రానికి అవసరమైన సిబ్బందిని కేటాయించాలని కోరుతున్నారు.
అధికారుల దృష్టికి ఖాళీల వివరాలు
ఖాళీ పోస్టుల వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి పంపించి,నిబంధనల ప్రకారం భర్తీ ప్రక్రియ చేపట్టాలని విజేత పత్రిక ముఖంగా స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది కొరతను పరిష్కరిస్తేనే చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలు అందేలా చూడవచ్చని అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం ఐసిడిఎస్ అధికారిని సుధారాణి :
మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్ల ఆయాల కొరత అద్దె భవనాల వల్ల ఇబ్బందులు ఉన్నాయని, అన్ని సౌకర్యాలు విద్యుత్తు సౌకర్యం కల్పిస్తున్నామని,ఖాళీలా వివరాలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని అన్ని ఇబ్బందులను అధిగమిస్తామని ఐసిడిఎస్ అధికారిని సుధారాణి తెలిపారు.