నాలుగోసారి అధికారానికి గట్టి వ్యూహం
హస్తినలో మేథోమధనం
భవిష్యత్ కార్యాచరణ సిద్ధం

విజేత, హైదరాబాద్ బ్యూరో : జాతీయ స్థాయి రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఎన్టీఏ ప్రభుత్వం చుట్టూ రాజకీయ వివాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రధాని మోదీ గ్రాఫ్ తగ్గుతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో మోడీ గట్టి ప్రభావం చూపుతున్న తరుణంలో దేశంలో రాజకీయ శక్తుల రూపంలో విదేశీ అరాచక శక్తులు ప్రవేశిస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి. మరోవైపు ఈ ముప్పును ముందుగానే గ్రహించిన మోదీ జాగ్రత్త పడుతున్నారు. రాజకీయంగా బలోపేతం కావడం ద్వారా విపక్షాలకు కనీసం ఛాన్స్ ఇవ్వకూడదని భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రజల రూటు మారకుండా ఉండేందుకు.. తన ప్రభుత్వంపై నమ్మకం సడలకుండా ఉండేలా ప్రణాళిక రూపొందిస్త్తున్నారు. ఇందుకుగాను మేథోమధనం చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. అందులో భాగంగా న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం సేవా తీర్థ్ వేదికగా కేంద్ర మంత్రులందరితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు నిర్వహించిన ఉన్నత స్థాయి మేధోమథన సదస్సు హాట్ టాపిక్ అయింది.
ఈ స్థాయి సమీక్ష తొలిసారిగా..
మోదీ ఆధ్వర్యంలో ఎన్డీయే-3 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి మంత్రుల మండలితో ప్రధాని ఇంతటి సుదీర్ఘ అంతర్గత సమీక్ష నిర్వహించడం ఇదే ప్రథమం. కేవలం విధానపరమైన నిర్ణయాలకే పరిమితం కాకుండా.. గత కొన్ని నెలలుగా వివిధ మంత్రిత్వ శాఖల పనితీరు, ప్రజా సమస్యల పరిష్కారంలో చూపిస్తున్న వేగం, వికసిత్ భారత్ రోడ్‌మ్యాప్ అమలుపై మోదీ లోతుగా సమీక్షించారు. కేంద్ర మంత్రులను ఎనిమిది ప్రత్యేక బృందాలుగా విభజించి, ప్రతి గ్రూపుతో విడివిడిగా సంభాషిస్తూ క్షేత్రస్థాయి ఫలితాలు ఎలా ఉన్నాయో కూలంకషంగా ఆరా తీశారు.ఈ రెండు రోజుల మేధోమథన సదస్సు ప్రధానంగా పరిపాలనా సంస్కరణలు, ప్రజా సంక్షేమ పథకాల డెలివరీ మెకానిజం చుట్టూనే తిరిగింది. బ్యూరోక్రసీపై పూర్తిగా ఆధారపడటం మానుకోవాలని, మంత్రులు స్వయంగా ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించాలని మోదీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. యువత, మహిళలకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయికి ఎంతవరకు చేరుతున్నాయన్న దానిపై గ్రౌండ్ రిపోర్టులు తెప్పించుకుని పరిశీలించారు. శాఖల మధ్య సమన్వయ లోపం ఉండకూడదని, ఫైళ్ల క్లియరెన్స్‌లో జాప్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. తాజా సమీక్షలో పలువురు మంత్రుల పనితీరు ఆశాజనకంగా లేదని తేలడంతో పాటు, కొందరి పోర్ట్‌ఫోలియోల్లో ఆశించిన వేగం కనిపించలేదన్న నివేదికలను ప్రధాని నేరుగా వారి ముందే ఉంచినట్లు సమాచారం.
మారిన పరిస్థితుల నేపథ్యంలో..
ప్రధానంగా దేశంలో పుట్టుకొస్తున్న జెన్ జీ ఉద్యమాలు, ఇతరత్రా అంశాలు తెరపైకి వచ్చిన క్రమంలో మోదీ భారీ వ్యూహాన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్‌లో ఎవరిని ఉంచాలి? ఎవరిని సాగనంపాలి? అనే అంశంపై ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ జాతీయ నాయకత్వానికి ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చినట్లు చెబుతున్నారు. గత ఎన్నికల తర్వాత కూటమి భాగస్వామ్యాల లెక్కలతో ఏర్పడిన మంత్రివర్గంలో కొందరికి అదనపు బాధ్యతలు ఉండగా, మరికొందరు ఆశించిన స్థాయి పనితీరును కనబరచలేకపోయారు. రాబోయే పలు కీలక రాష్ట్రాల శాసనసభ ఎన్నికల సమీకరణాలు, సామాజిక సమతుల్యత, పాలనా సామర్థ్యమే గీటురాయిగా మంత్రుల ర్యాంకింగ్‌లు, రిపోర్ట్ కార్డులను సిద్ధం చేశారు. ఆశించిన ఫలితాలు ఇవ్వని పలువురు మంత్రులను కేబినెట్ నుంచి తప్పించి పార్టీ సంస్థాగత బాధ్యతలకు పరిమితం చేయవచ్చని తెలుస్తోంది.
కొత్త ముఖాలు ఖాయం..
వచ్చే సార్వత్రి ఎన్నికలే లక్ష్యంగా ప్రధాని మోదీ గట్టి వ్యూహాలను రూపొందిస్తున్నట్టు అర్ధం అవుతోంది. కేంద్ర మంత్రివర్గంలో పెను మార్పులు, చేర్పులు త్వరలోనే ఉండబోతున్నాయన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. దాదాపు 15 నుంచి 17 కొత్త ముఖాలకు కేబినెట్ లేదా సహాయ మంత్రుల హోదాలో చోటు కల్పించవచ్చని, యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తూనే పనితీరు బాగున్న కొందరు సహాయ మంత్రులకు పదోన్నతులు కల్పించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో కీలక భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జేడీయూలతో పాటు ఇతర ఎన్డీయే మిత్రులకు ప్రాతినిధ్యం పెంచడం లేదా అదనపు శాఖలు కేటాయించే కసరత్తు కూడా కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ చింతన్ శివిర్ కేవలం సమీక్ష మాత్రమే కాదని, మోదీ మార్క్ నిర్దాక్షిణ్య ప్రక్షాళనకు వేసిన బలమైన పునాది అని గట్టిగానే గుసగుసలు వినిపిస్తున్నాయి.