*అత్తాపూర్ ఇస్కాన్ ఆలయంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు*
*భక్తిశ్రద్ధలతో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు గొట్టె గోపాల్ కృష్ణ యాదవ్*
విజేత,రాజేంద్రనగర్ : అత్తాపూర్ లోని ఇస్కాన్ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో ఘనంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక మహోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, యువజన, క్రీడలు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ యువజన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి, రాజేంద్రనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు గొట్టె గోపాల్ కృష్ణ యాదవ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముఖ్య అతిథులకు వేద మంత్రోచ్ఛారణల నడుమ ఘన స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందించారు.పూజా కార్యక్రమాల అనంతరం మంత్రులు, ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ.. ఆ శ్రీకృష్ణ భగవానుని దివ్య కటాక్షం తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలతో తెలంగాణ మురిసిపోవాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక నాయకులు పాల్గొని స్వామివారి సేవలో తరించారు.
