ఇందిరమ్మ ఇల్లు, జీవనోపాధికి భూమి కేటాయింపుపై హామీ.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం
విజేత, ములకలపల్లి : హైదరాబాద్లో దారుణ హత్యకు గురైన చౌటిగూడెం గ్రామానికి చెందిన ఊకే శిరీష కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి సీతక్క మంగళవారం వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. శిరీష మృతితో విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు, మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా రూ. లక్ష, ఐటీడీఏ నుంచి రూ.30 వేల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి తాను వ్యక్తిగతంగా మరో రూ. లక్ష సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. మొత్తంగా రూ.7.30 లక్షల ఆర్థిక సాయం అందనుంది.కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతోపాటు, జీవనోపాధి కోసం భూమి కేటాయించే అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కుటుంబానికి ఆసరాగా నిలిచిన శిరీషను కోల్పోవడం అత్యంత బాధాకరమని అన్నారు. కుటుంబాన్ని పోషించే శిరీష మృతి ఆ కుటుంబానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. శిరీష కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కాంగ్రెస్ నాయకులు బత్తుల అంజి, జహీర్, కారం సుదీర్, సర్పంచ్ వినోద్, ఆదివాసీ నాయకులు ఊకే రవి తదితరులు పాల్గొన్నారు.