విజేత, దుండిగల్ : దుండిగల్ డివిజన్ గాగిల్లాపూర్ దుండిగల్ తండా -2 పరిసర ప్రాంతాల్లో కాలుష్య సమస్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక ప్రజలు రాంకీ సంస్థ ముందు ధర్నాకు దిగారు. పరిశ్రమలు, వ్యర్థాల నిర్వహణ కేంద్రాల కారణంగా తమ ప్రాంతంలో దుర్వాసన, పొగ, దుమ్ము తదితర సమస్యలు ఎదురవుతున్నాయని తండా ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ.. పరిశ్రమల అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అయితే పర్యావరణ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంస్థలు నిర్వహించాలని కోరారు. కాలుష్యం కారణంగా తండా ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని వారు ఆరోపించారు.తండా పరిసరాల్లో గాలి, నీరు, నేల నాణ్యతపై శాస్త్రీయ పరీక్షలు నిర్వహించాలని, కాలుష్యానికి కారణమవుతున్న అంశాలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరారు. కాలుష్య సమస్యపై అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని ప్రజలు కోరారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.“అభివృద్ధి కావాలి.. కానీ ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కాదు. మా పిల్లలకు స్వచ్ఛమైన గాలి, సురక్షితమైన నీరు అందించాలి” అని తండా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు