రిలే నిరాహార దీక్షలు ప్రారంభించిన
పలువురు ప్రజా ప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు
సంఘీభావం ప్రకటించిన బిజెపి కమ్యూనిస్టు పార్టీల నాయకులు
దీక్షలో కూర్చున్న ఎమ్మార్పీఎస్ బిజెపి కాంగ్రెస్ సిపిఐ నాయకులు ఫ్యూచర్ సిటీ జేఏసీ నాయకులు
విజేత,మహేశ్వరం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలో మహేశ్వరం మండలాన్ని తప్పనిసరిగా విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ మహేశ్వరం ఫ్యూచర్ సిటీ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు సోమవారం ఉదృతంగా ప్రారంభమయ్యాయి.మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో జేఏసీ నాయకులు రెండు రోజుల పాటు రిలే నిరాహార దీక్షకు కూర్చున్నారు.
ఏడాదిగా ఉద్యమం:
గత ఏడాది కాలంగా మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్ సిటీలో కలపాలని ఫ్యూచర్ సిటీ జేఏసీ నాయకులు నిరంతరం పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ధర్నాలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. అయినా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆందోళనను మరింత ఉధృతం చేస్తూ రిలే నిరాహార దీక్షలకు పిలుపునిచ్చారు.

పార్టీలకతీతంగా మద్దతు:
ఈ దీక్షలకు కుల, మత, పార్టీలకతీతంగా అన్ని వర్గాల నుంచి భారీ మద్దతు లభించింది. ఫ్యూచర్ సిటీ జేఏసీ అధ్యక్షుడు వి.రఘుపతి, గౌరవ అధ్యక్షుడు కర్నాటి మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కడారి జంగయ్య యాదవ్, సీనియర్ బీజేపీ నాయకులు పోతల దర్శన్ యాదవ్, సీపీఐ రాష్ట్ర నాయకులు దత్తు నాయక్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వి.మల్లేష్ యాదవ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు పాండు నాయక్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఎర్ర గణేష్, మన్సాన్ పల్లి గ్రామ ఉప సర్పంచ్ వి.నరసింహ యాదవ్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఈశ్వర్ నాయక్, బీజేపీ నాయకులు అల్లంపల్లి మల్లేష్, రమేష్, పి.సాంబయ్య యాదవ్, ఐ.నరసింహ గౌడ్, సర్దార్ నగర్,బీజేపీ నాయకులు స్వామి గౌడ్, అశోక్ గౌడ్ తదితర వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు.ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ రఘుపతి మాట్లాడుతూ, మహేశ్వరం మండలం ఫ్యూచర్ సిటీకి అత్యంత సమీపంలో ఉందని, మండలాన్ని కలపకపోతే ఇక్కడి రైతులు, యువత తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో మహేశ్వరాన్ని విస్మరించడం సరికాదని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్ సిటీలో విలీనం చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్ నెరవేరే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.
