అమ్మవారిని దర్శించుకున్న ఏడుపాయల మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి
విజేత, పాపన్నపేట : మహాగౌరీదేవి అలంకారంలో ఏడుపాయల వనదుర్గాదేవి భక్త జనావళికి దర్శనమిచ్చారు.శ్రీ ఏడుపాయల పుణ్యక్షేత్రం లో దేవీశరన్నవ రాత్రుల మహోత్సవాలు వైభవోపేతంగా అంగరంగవైభవంగా దుర్గానామస్మరణలతో భక్తితన్మయంతో జరుగుతున్నాయి. దేవీశరన్నవ రాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజైన ఆదివారం ప్రధాన ఆలయ గర్భాలయంలో, ఉత్సవ మండపంలో మహాగౌరీదేవి అమ్మవారి అలంకారంలో ఎరుపు పట్టువస్త్రంలో వన దుర్గాదేవి భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం ఉదయం ప్రధాన ఆలయంలో మహాగౌరీ అలంకారంలో ఉన్న దుర్గాభవాని అమ్మ వారికి, గోకుల్ షెడ్ లోని ఉత్సవ మండపంలో మహాగౌరీదేవి అలంకారంలో ఉన్న దుర్గాదేవి అమ్మవారికి వేద బ్రాహ్మణ పండితులు ఆర్ శంకర్ శర్మ, పార్టీవశర్మ, మురళీధర్, రాజేశ్వర్ శర్మ ల ఆధ్వర్యంలో దేవీ నవరాత్రుల విశేష పూజలు నిర్వహించారు. ఏడుపాయల మాజీ చైర్మన్ పి విష్ణువర్ధన్ రెడ్డి దంపతులు, తదితర మహిళలు,భక్తులు అమ్మవారికి కుంకుమార్చన విశేషాలంకరణ పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి భక్తుల పెద్దఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు ను స్వీకరించారు. ఏడుపాయల్లో దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలతో ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈఓ వీరేశం ఆధ్వర్యంలో సిబ్బంది చర్యలు తీసుకున్నారు.
