- గల్లంతైన ఆరుగురు మత్స్యకారులు సహా 16 మందిని సురక్షితంగా కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం
- రాత్రంతా చెరువు వద్దే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించిన ఎమ్మెల్యే రాగమయి
విజేత, సత్తుపల్లి: సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో చోటుచేసుకున్న ఘటన తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. గల్లంతైన ఆరుగురు మత్స్యకారులతో పాటు, వారిని రక్షించే క్రమంలో ప్రమాదంలో చిక్కుకున్న ఆరుగురు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, నలుగురు అగ్నిమాపక శాఖ సిబ్బందిని ఎన్డీఆర్ఎఫ్ బృందం సురక్షితంగా రక్షించింది. మొత్తం 16 మందిని క్షేమంగా బయటకు తీసుకురావడంతో తీవ్ర ఆందోళనకు గురైన బాధిత కుటుంబాలు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో బేతుపల్లి చెరువు వద్ద నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రాత్రంతా బేతుపల్లి చెరువు వద్దే ఉండి సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. బాధితుల ప్రాణాలను కాపాడేందుకు అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి అవసరమైన సహాయక చర్యలు వేగవంతం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ఎమ్మెల్యే రాత్రంతా అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షించడంపై స్థానిక ప్రజలు, మత్స్యకారులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.మరోవైపు ఖమ్మం జిల్లా కలెక్టర్ కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి సహాయక చర్యలపై నిరంతరం సమీక్షించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తూ, అవసరమైన యంత్రాంగాన్ని, సహాయక వనరులను అందుబాటులోకి తీసుకొచ్చారు. సహాయక చర్యలు వేగంగా కొనసాగేందుకు చేసిన కృషిపై స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు కలెక్టర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవ చూపుతూ సహాయక చర్యలకు అవసరమైన ఏర్పాట్లు చేయడంపై ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి అవసరమైన సహకారం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.ప్రాణాలను పణంగా పెట్టి సహాయక చర్యల్లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది సమన్వయంతో పనిచేసి 16 మంది ప్రాణాలను కాపాడటం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో అందరూ సురక్షితంగా బయటపడటంతో మత్స్యకారుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది.
