కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం.. శంభీపూర్ క్రిష్ణ ఆధ్వర్యంలో నిరసన
విజేత, దుండిగల్ : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను అసెంబ్లీ వేదికగా ప్రశ్నించేందుకు వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ దుండిగల్ సర్కిల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ పరిధిలోని దుండిగల్ గండిమైసమ్మ సర్కిల్ కార్యాలయం వద్ద సోమవారం ఉదయం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా శంభీపూర్ క్రిష్ణ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేందుకు వెళ్తున్న ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేయడం దుర్మార్గమని విమర్శించారు. ప్రజల తరఫున ప్రశ్నించే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.కేవలం నల్ల దుస్తులు ధరించారనే కారణంతో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్షాల హక్కు మాత్రమే కాకుండా ప్రజల తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధుల బాధ్యత అని పేర్కొన్నారు.ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించకుండా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని శంభీపూర్ క్రిష్ణ ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ నిలుస్తుందని, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతామని నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో దుండిగల్ సర్కిల్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.