నవోదయ కెనాల్ పరిధిలో 5 హెచ్పీ మోటార్లు అపహరణ
నీరు అందక పంట నష్టపోతామని రైతుల ఆవేదన
విజేత,చొప్పదండి: పంట చేతికొచ్చే సమయంలో గుర్తుతెలియని దొంగలు రైతుల పాలిట శాపంగా మారారు. చొప్పదండి మర్లవాడకు చెందిన రైతులు ఎగుర్ల రాజమల్లు, అమరగొండ తిరుపతికి సంబంధించిన వ్యవసాయ బోరు మోటార్లను గురువారం రాత్రి దొంగలు అపహరించారు.ఒక్కొక్కటి 5 హెచ్పీ సామర్థ్యం కలిగిన మోటార్లను ఫ్యూజులు తొలగించి మరీ ఎత్తుకెళ్లడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నవోదయ కెనాల్ ప్రాంతంలోని తమ పంటలు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయని, మరో వారం రోజుల పాటు నీరు అందిస్తే పంట చేతికి వచ్చేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కీలక దశలో ఉన్న సమయంలో మోటార్లు చోరీ కావడంతో నీరు అందక పంట నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

రాత్రి వేళల్లో వ్యవసాయ పొలాల వద్ద దొంగతనాలు జరుగుతుండటంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు.గత రెండు రోజులు గా 4 గురి మోటార్ల చోరీ జరిగాయి,పోలీసులు వ్యవసాయ ప్రాంతాల్లో రాత్రి గస్తీని ముమ్మరం చేసి, మోటార్ల చోరీలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.
