నేషనల్ లెవల్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్‌లో పాల్గొన్న ముల్కనూర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్
– బెంగళూరు వేదికగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పై ప్రత్యేక శిక్షణ
విజేత,చిగురుమామిడి : జాతీయ విద్యా విధానం-2020 అమలులో భాగంగా, విద్యార్థులకు వృత్తి విద్యా నైపుణ్యాలను అందించాలనే సంకల్పంతో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులోని ఎన్‌ఎస్‌టీఐ కేంద్రంలో నిర్వహించిన 5 రోజుల జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమంలో ముల్కనూర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ హర్జిత్ కౌర్ పాల్గొన్నారు.ఈ శిక్షణలో భాగంగా ఎన్ఇపి -2020లో ఒకేషనల్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యతపై సమగ్ర చర్చ జరిగింది. 9 నుండి 12వ తరగతి విద్యార్థులకు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వర్చువల్ ల్యాబ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,డిజిటల్ టెక్నాలజీ వంటి అత్యాధునిక అంశాలతో కోర్సులను రూపొందించినట్లు హర్జిత్ కౌర్ తెలిపారు. అంతేకాకుండా, కెరీర్ కార్డ్స్, ప్రత్యేక మొబైల్ యాప్ కెరీర్ ద్వారా విద్యార్థులకు ఉపాధి మార్గాలను సుగమం చేస్తున్నట్లు ఆమె వివరించారు.ఐదు రోజుల శిక్షణ ముగింపులో, తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రిన్సిపల్ హర్జిత్ కౌర్ కీలక ప్రెసెంటేషన్ ఇచ్చారు. తమ పాఠశాలలో ఒకేషనల్ కోర్సులను అమలు చేస్తున్న తీరు, ఆన్-జాబ్ ట్రైనింగ్, ఫీల్డ్ విజిట్స్, మరియు గెస్ట్ లెక్చరర్ల ద్వారా విద్యార్థులకు అందిస్తున్న శిక్షణను వివరించారు. రాష్ట్రంలో వృత్తి విద్యా బోధనలో తీసుకుంటున్న చర్యలను జాతీయ స్థాయి ప్రతినిధులు అభినందించారు.ఈ ఐదు రోజుల శిక్షణలో తాను నేర్చుకున్న నూతన బోధనా పద్ధతులను, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లలో భాగంగా ఇతర ఉపాధ్యాయులకు కూడా అందించనున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వృత్తి విద్యా నైపుణ్యాలు అందుతాయని తెలిపారు.