- డెంగ్యూ చికిత్స పొందుతూ 13 ఏళ్ల బాలుడు మృతి.
- వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యుల ఆందోళన.. రూ.6 లక్షలకు సెటిల్‌మెంట్!.
విజేత, ఇబ్రహీంపట్నం :తుర్కయంజాల్‌లోని తార హాస్పిటల్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. డెంగ్యూ జ్వరంతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన 13 ఏళ్ల బాలుడు పరిస్థితి విషమించి మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు మృతదేహంతో ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి ఆసుపత్రి యాజమాన్యం, బాలుడి కుటుంబ సభ్యుల మధ్య చర్చలు జరగ్గా, రూ.6 లక్షలకు సెటిల్‌మెంట్ జరిగినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న 13 ఏళ్ల బాలుడిని కుటుంబ సభ్యులు తుర్కయంజాల్‌లోని తార హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని తార హాస్పిటల్ యాజమాన్యం సూచించినట్లు సమాచారం. తార హాస్పిటల్ సూచన మేరకు బాలుడిని రెయిన్బో హాస్పిటల్‌కు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. అప్పటివరకు తమ బిడ్డ కోలుకుంటాడని ఆశించిన కుటుంబ సభ్యులు, బాలుడి మృతితో కన్నీరుమున్నీరయ్యారు. తార హాస్పిటల్‌లో అందించిన వైద్య సేవలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, వైద్యుల నిర్లక్ష్యమే తమ బిడ్డ మృతికి కారణమని ఆరోపించారు.
*మృతదేహంతో ఆసుపత్రి ఎదుట ఆందోళన.*
బాలుడి మృతితో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తార హాస్పిటల్ ఎదుట ఉంచి ఆందోళన చేపట్టినట్లు సమాచారం. తమకు న్యాయం చేయాలని, బాలుడి మృతికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఈ పరిణామంతో ఆసుపత్రి పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో బాలుడి కుటుంబ సభ్యులు, తార హాస్పిటల్ యాజమాన్యం మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ చర్చల్లో భాగంగా రూ.6 లక్షల మొత్తానికి సెటిల్‌మెంట్ కుదిరినట్లు తెలిసింది. అయితే ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు, చెల్లింపు విధానం, ఇరు పక్షాల అధికారిక స్పందనపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. మైనర్ బాలుడి మృతి ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. బాలుడికి అందించిన చికిత్స, వైద్య రికార్డులు, మరణానికి గల కారణాలను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం జరిగిందా లేదా అనే అంశంపై అధికారిక విచారణతోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.