గుంతల మయం... గుండెల్లో భయం
శివరాంపల్లి రోడ్లపై నరకప్రాయ ప్రయాణం
అధికారుల నిర్లక్ష్యానికి వాహనదారుల బలి
విజేత,రాజేంద్రనగర్ :రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శివరాంపల్లి గ్రామంలో రోడ్ల పరిస్థితి దయనీయంగా మారింది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ప్రధాన రహదారులు గుంతల మయంగా మారి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోడ్డంతా కంకర తేలి, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని స్థితిలో స్థానికులు, వాహనదారులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు.
స్కూల్ జోన్‌లోనూ ఇదే నిర్లక్ష్యమా ?
ప్రధానంగా శివరాంపల్లిలోని 'గౌతమ్ మోడల్ స్కూల్' సమీపంలో ఉన్న రోడ్డు పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. నిత్యం వందలాది మంది చిన్నారులను తీసుకువెళ్లే స్కూల్ బస్సులు, ఆటోలు ఈ గుంతల రోడ్డుపైనే అటు ఇటూ ఊగుతూ ప్రమాదకరంగా ప్రయాణించాల్సి వస్తోంది. భారీ వాహనాలు వెళ్లేటప్పుడు ఎగిరిపడే కంకర రాళ్లు నడుచుకుంటూ వెళ్లే విద్యార్థులపై, పాదచారులపై పడుతుండటంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు ఏ రోజైనా ఇటువైపు కన్నెత్తి చూశారా అని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డంతా గుంతలు.. నిత్యం తప్పుతున్న ప్రమాదాలు
వర్షపు నీరు నిలవడం, డ్రైనేజీ లీకేజీల వల్ల రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయి కేవలం మట్టి, కంకర రాళ్లతో దర్శనమిస్తోంది. ద్విచక్ర వాహనదారులు బ్రేక్ వేస్తే చాలు, బండి స్కిడ్ అయి కిందపడిపోతున్నారు. రాత్రి వేళల్లో ఈ గుంతలు కనిపించక ఎంతోమంది వాహనదారులు కిందపడి తీవ్రంగా గాయపడుతున్నారు. అయినప్పటికీ సంబంధిత రాజేంద్రనగర్ సర్కిల్ అధికారులు కనీసం తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టకపోవడం వారి బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోంది.
ప్రజాప్రతినిధులుఅధికారులు .. మీ కళ్లు తెరవండి
పన్నులు వసూలు చేయడంలో చూపించే శ్రద్ధ, కనీస రహదారి సౌకర్యాలు కల్పించడంలో ఎందుకు చూపించడం లేదు? ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి అమాయకుల ప్రాణాలు పోయాకే అధికారులు నిద్ర లేస్తారా?ఏసీ కార్లలో తిరిగే అధికారులకు, నాయకులకు సామాన్య ప్రజల కష్టాలు పట్టవా?
స్థానికుల డిమాండ్:
ఇప్పటికైనా జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి, యుద్ధప్రాతిపదికన శివరాంపల్లి ప్రధాన రహదారికి మరమ్మతులు చేపట్టి తమ ప్రాణాలను కాపాడాలని స్థానిక ప్రజలు, వాహనదారులు ఘాటుగా డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.
