*ఇందిరాగాంధీ హౌసింగ్ సొసైటీలో అక్రమ కమర్షియల్ షెడ్ల జోరు*
*మామూళ్ల మత్తులో టౌన్ ప్లానింగ్ సిబ్బంది? పర్యవేక్షణ మరిచిన ఉన్నతాధికారులు*
విజేత,రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని కాటేదాన్‌లో అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారింది. స్థానిక ఇందిరాగాంధీ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో నిబంధనలకు తూట్లు పొడుస్తూ కమర్షియల్ షెడ్ల నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గతంలో జీహెచ్ఎంసీ అధికారులు ఆర్భాటంగా కూల్చివేతలు జరిపిన చోటే, ఇప్పుడు మళ్లీ రాత్రికి రాత్రే కొత్త షెడ్లు వెలుస్తుండటం అధికార యంత్రాంగం పనితీరుకు అద్దం పడుతోంది.గతంలో ఇదే సొసైటీలో అక్రమంగా నిర్మించిన కమర్షియల్ షెడ్లపై ఫిర్యాదులు రావడంతో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. అయితే, ఆ కూల్చివేతలు కేవలం "కంటితుడుపు" చర్యలుగానే మిగిలిపోయాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూల్చిన శిథిలాలు తొలగించకముందే, అవే స్థలాల్లో రెట్టింపు వేగంతో మళ్లీ నిర్మాణాలు జరగడం వెనుక ఆంతర్యమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు, సొసైటీలో మరిన్ని కొత్త కమర్షియల్ షెడ్లు కూడా శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి.
*టౌన్ ప్లానింగ్ సిబ్బంది 'చేతివాటం'పై అనుమానాలు*
పట్టపగలు, బహిరంగంగానే ఇంత పెద్ద ఎత్తున కమర్షియల్ నిర్మాణాలు జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ విభాగం కన్నెత్తి చూడకపోవడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిన కింది స్థాయి టౌన్ ప్లానింగ్ సిబ్బంది, అక్రమార్కులతో కుమ్మక్కై 'మామూళ్ల' మత్తులో జోగుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సిబ్బంది అండదండలు లేకుండా కూల్చిన చోట మళ్లీ నిర్మాణాలు చేపట్టే ధైర్యం ఎవరికీ ఉండదని స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
*ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఏదీ?*
కింది స్థాయి సిబ్బంది అక్రమాలకు వత్తాసు పలుకుతుంటే, వారిని నియంత్రించాల్సిన సర్కిల్ స్థాయి ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. నిబంధనల ప్రకారం రెసిడెన్షియల్ సొసైటీలో వాణిజ్య కార్యకలాపాలు, కమర్షియల్ షెడ్ల నిర్మాణం నిషిద్ధం. అయినా సరే, అక్రమార్కులు బరితెగిస్తుంటే అధికారులు చోద్యం చూడటం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.ఇప్పటికైనా జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు స్పందించి, కాటేదాన్ ఇందిరాగాంధీ హౌసింగ్ సొసైటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను తక్షణమే అడ్డుకోవాలని, అక్రమార్కులకు సహకరిస్తున్న టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
