కింగ్ మేకర్ గా పవన్ ??? 40-45 స్థానాలలో గెలుపోటములను ప్రభావితం చేసే సత్తా ?

 12-01-2023     139కింగ్ మేకర్ గా పవన్ ???
40-45 స్థానాలలో గెలుపోటములను ప్రభావితం చేసే సత్తా ?

 

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వేడి అప్పుడే పెరిగింది. గెలుపు కోసం తమ తమ వ్యూహాలను తయారు చేసుకోవడం లో ప్రధాన పార్టీ లైన వై సి పి, టి డి పి, జనసేనలు తలమునకలై వున్నాయి. వై నాట్ 175 అన్నది వై సి పి నినాదమైతే, ఇదేం ఖర్మరా బాబూ అంటూ వై సి పి వైఫల్యాలను ఎండగడుతూ, అధికారం ఎలాగైనా దక్కించుకోవాలన్న పట్టుదలతో వుంది తెలుగుదేశం పార్టీ. అయితే మూడవ ప్రధాన పార్టీ అయిన జనసేనకు ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల ముఖచిత్రంలో ఒక ప్రత్యేక స్థానం వుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

2014 లో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ స్థాపించినప్పుడు ఎందరో ఈయన పార్టీ ఎందుకు పెట్టారు అంటూ విమర్శల వర్షం కురిపించారు. విభజన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలలో అభివృద్ధికి పట్టం కట్టాలని ,2014 ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయకుండా టీడీపీ- బి జె పి కూటమికి మద్దతు ఇచ్చింది. టీడీపీ- బి జె పి లకు మద్దతుగా పవన్ కళ్యాణ్ విస్తృతంగా  ప్రచారం కూడా చేశారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మాత్రం కమ్యూనిస్టులతో  జత కట్టి  జనసేన పోటీ చేసింది. కానీ ఒక్క సీటుకే పరిమితం అయిపోయింది. దీంతో ఇక జనసేన పని అయిపోయినట్టే అని అందరూ అన్నారు. కానీ వీరోచిత పోరాటాలకు ఆద్యుడు అయిన పవన్ కళ్యాణ్ మాత్రం వెనకడుగు వేయలేదు.ఓటమిని దిగమింగుకొని తన కాడర్ జారిపోకుండా కాపాడుకుంటూ, వారిలో పోరాట పటిమ, ఆత్మ విశ్వాసాన్ని నింపుతూ, తన టార్గెట్ ను 2024 కు సెట్ చేసుకున్నారు. ఈ సందర్భంలో కూడా ఆయన రాజకీయ ప్రత్యర్ధులు ,విమర్శకులు అసలు జనసేన పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఆ ఒక్క సీటు కూడా రాదని ఎద్దేవా చేశారు. అసలు పవన్ కళ్యాణ్ గెలిస్తే చాలు.. పార్టీ గెలవాల్సిన అవసరం లేదు అన్నారు. కానీ.. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు పరిశీలిస్తే జనసేన పార్టీకి ఆదరణ క్రమ క్రమంగా పెరుగుతునట్లు తెలుస్తోంది.

ఈసారి వైసిపి 175 స్థానాల్లోనూ గెలవాలనే టార్గెట్ ను విధించుకోగా, ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ వైసిపి పాలన రాకుండా చూసేందుకు టిడిపి ,జనసేన, బిజెపిలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
     అదీ కాకుండా విపక్ష పార్టీలన్నీ కలిసి పోటీ చేస్తే మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాకుండా చేయవచ్చు అనే అంచనాతో ఉన్నాయి.అందుకే జనసేన ను కలుపుకు వెళ్లేందుకు అటు టిడిపి,  ఇటు బిజెపి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి.ఏపీ వ్యాప్తంగా చూసుకుంటే కనీసం 40-45 స్థానాల్లో అభ్యర్థుల గెలుపు ఓటములు జనసేన ప్రభావితం చేసే స్థాయిలో ఉండడం , ముఖ్యంగా ఉత్తరాంధ్ర,  గోదావరి జిల్లాలో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తూ ఉండడంతో జనసేనకు ఆ స్థాయిలో డిమాండ్ పెరిగింది.

తనకెన్ని సీట్లు వస్తాయి దానికన్నా ప్రత్యర్థి పార్టీ గెలవ గులుగుతుందా? ఓటమి పాలవుతుందా? అనేదానికి సమాధానం జనసేన దగ్గర ఉంది. అందుకే ఆంధ్ర రాజకీయాల్లో పవన్ కల్యాణ్ కు డిమాండ్ పెరిగింది. తెలుగుదేశం, జనసేన కలిస్తే వైసీపీకి చెక్ పెట్టవచ్చు అనేది ఈ రెండు పార్టీల ప్రణాళికగా ఉంది. జనసేన తమతో కలిస్తే అధికార పీఠాన్ని సులువుగా అధిరోహించవచ్చని తెలుగుదేశం భావిస్తోంది. ఈ రెండు పార్టీలు కలవనీయకుండా అధికార పార్టీ రాజకీయం.. ఇలా రాష్ట్ర రాజకీయం అంతా  పవన్ చుట్టూ తిరుగుతోంది. ఏపీలో రాజకీయాన్ని మార్చగలిగే దశకు చేరుకున్న జనసేన త్వరలోనే ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి వస్తుందని ఆ పార్టీ నాయకులు, పవన్ అభిమానులు విశ్వాసంతో ఉన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిలబెట్టడానికి జనసేనకు బలమైన అభ్యర్థులు లేరు. ఆ పార్టీకి ఎన్నికలలో పోటీ చేసేందుకు అవసరమైన ఆర్ధిక వనరులు కూడా లేవు. అయితే మెగా ఫ్యామిలీ అభిమానులే ఆ పార్టీకి కొండంత అండగా వున్నారు. రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి పవన్ ఎదగాలన్నది వారి ప్రగాఢ కోరిక. కానీ రాజకీయం మొత్తాన్ని తన చుట్టూ తిప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయినా, టీడీపీ అధినేత చంద్రబాబు అయినా పవన్ పేరు స్మరించాల్సిన పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో నెలకొంది. తాజాగా చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యాక వై సి పి నాయకులలో బి పి పెరిగింది. అధికార పీఠం దూరమైనంతగా ఆందోళన చెందారు. ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలంతా జనసేనాని పేరు నిరంతరం స్మరిస్తున్నారు. . అంతలా ఏపీలో ప్రభావాన్ని చూపుతున్నారు. జనసేన పార్టీ విడిగా పోటీచేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది. 40 నుంచి 45 నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను తారుమారు చేయగలదు.ఇదే ఆ పార్టీకి వున్న ప్రధానమైన అస్త్రం.
ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన టిడిపిలు పొత్తు పెట్టుకోకుండా వైసిపి సెటైర్లు వేస్తోంది.వారిద్దరి మధ్య పొత్తు సప్ఫలీకృతమవకుండా దిల్లీలో కూడా వై సి పి లాబీయింగ్ చేస్తోందని, బి జె పి ని ఉసిగొల్పు తోందని కుడా వ్యాఖ్యానాలు వస్తున్నాయి.పైకి  ఒంటరిగా పోటీ చేస్తామంటూ వైసీపీ చెబుతున్నప్పటికి  టిడిపి , జనసేనలు కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా తమకు ఇబ్బందులు ఏర్పడతాయనే భయము అధికార పార్టీ వైసీపీలో ప్రస్పుటంగా కనిపిస్తోంది.

 

ప్రస్తుతం జనసేన పార్టీకి 13 శాతం ఓటు బ్యాంకు ఉంది. నిజానికి పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్రను ప్రారంభించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల బస్సు యాత్రను ప్రారంభించలేదు. ఒకవేళ బస్సు యాత్రను ప్రారంభించి వుంటే 13 శాతం నుంచి 20 శాతానికి ఓటు బ్యాంకు పెరిగి ఉండేదంటూ సర్వే అంచనా వేసింది. అంతే తన స్వంత ఓటు బ్యాంకుతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా జనసేన ఖాతాలో వచ్చి పడుతుందన్నది తెలుస్తోంది. ఒకవేళ పార్టీలోకి అసంతృప్తులు, ఇతర ముఖ్య నేతలు చేరితే  ఓటు బ్యాంకు ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. రాష్ట్ర రాజకీయాలు పవన్ కళ్యాణ్ వైపు తిరగడం కాదు.. ఏపీలోనే బలమైన ప్రాంతీయ పార్టీగా జనసేన ఎదిగే అవకాశం ఉందని సర్వే చెబుతోంది. వచ్చే ఎన్నికలలో  జనసేన ప్రభావం ఎంత మేరకు ఉండనుందో తెలియాలంటే కొన్ని నెలలు ఆగి చూడాల్సిందే.


Latest News
more

Trending
more


Viewers
visit counter