రిలయన్స్ నాయకత్వం మార్పుపై ముఖేష్ అంబానీ ప్రస్తావన
29-12-2021
131
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ నాయకత్వం మార్పుపై తొలిసారి ప్రస్తావించారు. సంస్థలో అత్యంత ప్రతిభావంతమైన నాయకత్వ మార్పుకు శ్రీకారం పడనున్నట్లు చెప్పారు. తనతో పాటు సీనియర్లందరూ ఈ మార్పులో భాగస్వాములు అవుతారని రిలయన్స్ ఫ్యామిలీ డే కార్యక్రమంలో స్పష్టం చేశారు. యువతరం చేతికి పగ్గాలు ఇస్తామన్నారు.
దేశంలోనే అత్యంత విలువైన కంపెనీకి సంబంధించిన వారసత్వ ప్రణాళికలపై ఇప్పటి వరకూ నోరువిప్పని ముఖేశ్ అంబానీ(64) మొదటిసారిగా 'ఇకపై నాయకత్వ మార్పు ప్రక్రియను వేగవంతం చేస్తామ'ని అనడం విశేషం.
ముఖేశ్ అంబానీ, నీతా దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కొడుకులు(ఆకాశ్, అనంత్), కూతురు(ఈశా) ఉన్నారు. వారిలో ఆకాశ్, ఈశాలు కవలలు.
రిలయన్స్ వ్యవస్థాపకులైన ధీరూభాయ్ అంబానీ జయంతి సందర్భంగా ఏటా జరిపే 'రిలయన్స్ ఫ్యామిలీ డే' లో ముఖేష్ పలు ఆసక్తికర విషయాలను ప్రస్తావించారు. అతిత్వరలోనే రిలయన్స్ గ్రూప్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక బహుళ జాతి కంపెనీగా ముద్ర వేయనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాజాగా అడుగుపెడుతున్న క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ సెక్టార్ తో పాటు టెలికాం వ్యాపారాల్లో అందుకోలేనంత ఎత్తుకు ఎదగనున్నట్లు చెప్పారు.
గొప్ప కలలను, అసాధ్యంగా కనిపించే లక్ష్యాలను సాకారం చేసుకోవాలంటే సరైన వ్యక్తులు, సరైన నాయకత్వంతోనే సాధ్యమవుతుందని అన్నారు. ప్రస్తుతం కీలక దశలో మార్పు దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు. ఆ మార్పు తనతో పాటు, తన తరం సీనియర్ వ్యక్తుల నుంచి తదుపరి తరం అయిన యువ నాయకులకు జరుగుతుందని అన్నారు. అంతేకాదు ఈ ప్రక్రియ వేగవంతం అవుతుందని చెప్పారు. .
ఆకాశ్, ఈశా, అనంత్ పై నమ్మకం ఉంది
అందరు సీనియర్లు, తనతో సహా, పూర్తిగా పోటీతత్వంతో పాటు అంకిత భావంతో పనిచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖేశ్ తెలియజేశారు. ఇందుకు యువతరం సైతం సిద్ధమవుతోందని చెప్పారు. వారిని గైడ్ చేయడంతోపాటు, శక్తివంతులను చేసి, వారి వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తామని చెప్పారు.
ఆకాశ్, ఈశా, అనంత్‌లపై ఎటువంటి అనుమానమూ లేదని.. తదుపరి తరం నాయకులుగా వారు రిలయన్స్‌ను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. వారిలో ఆ ప్రతిభ, శక్తి ఉందని తన వారసులపై ధీమా వ్యక్తం చేశారు.