నా ఆటోబయోగ్రఫీలో తెలియజేస్తా-హర్భజన్ సింగ్

 25-12-2021     333భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ రిటైర్ మెంట్ ప్రకటించిన తర్వాత తన జీవితంలో మాయని మచ్చలా మిగిలిన 'మంకీ గేట్ వివాదం' పై తొలిసారి స్పందించాడు. నాడు మైదానంలో ఏం జరిగిందనే విషయాన్ని త్వరలోనే ప్రజలకు తెలియజేస్తానని చెప్పాడు. ఈ వివాదంలో తనవైపు నుంచి ఎవరూ ఆలోచించలేదని అన్నాడు. అప్పట్లో కొన్ని వారాల పాటు మానసిక ఆందోళనకు గురైనా ఎవరూ పట్టించుకోలేదని తెలిపాడు. ఈ విషయంపై తానెప్పుడూ మాట్లాడలేదని.. త్వరలోనే ప్రజలందరికీ తన ఆటోబయోగ్రఫీ ద్వారా ఏం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తానని చెప్పాడు.

మంకీ గేట్ వివాదం రచ్చ

2008లో టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా పర్యటనలో చోటుచేసుకున్న 'మంకీ గేట్ వివాదం' రచ్చ అంతా ఇంతా కాదు. ఈ మొత్తం వ్యవహారం భారత స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ ఆండ్రూ సైమండ్స్‌ చుట్టూనే తిరిగింది. ఈ వివాదంలో హర్భజన్ సింగ్ జాతివిద్వేష వ్యాఖ్యలు చేయలేదని తేలినా.. చివరికి మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోతకు గురయ్యాడు.  

అసలేం జరిగింది..?  

సిడ్నీలో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 463 పరుగులు చేసింది. సైమండ్స్‌ 162 పరుగులు చేశాడు. అనంతరం వీవీఎస్‌ లక్ష్మణ్‌ 109 పరుగులు, సచిన్‌ 154 పరుగులతో ఇద్దరూ శతకాలతో చెలరేగడంతో భారత్‌ 532 పరుగులు చేసింది. మధ్యలో హర్భజన్‌ 63 పరుగులు చేశాడు. అయితే, ఇన్నింగ్స్‌ 116వ ఓవర్‌ తర్వాత హర్భజన్ సింగ్ నాన్‌స్ట్రైకింగ్‌ వైపు వెళ్లి సైమండ్స్‌తో ఏదో మాట్లాడాడు. వెంటనే ఇద్దరి మధ్య వివాదం రేగింది. ఇక మ్యాచ్‌ అనంతరం హర్భజన్‌.. సైమండ్స్‌పై జాతి విద్వేష వ్యాఖ్యలు చేశాడని, కోతి అని పిలిచాడని ఆ జట్టు కెప్టెన్‌ రికీపాంటింగ్‌.. అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. ఇది మ్యాచ్‌ రిఫరీ వరకు వెళ్లగా టీమ్‌ఇండియా స్పిన్నర్‌పై 3 టెస్టుల నిషేధం పడింది.

ఈ ఉదంతంపై పూర్తి విచారణ చేసిన ఐసీసీ.. హర్భన్ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని నిర్ధారించడంతో నిషేధం ఎత్తివేసింది. కానీ మ్యాచ్ ఫీజులో 50శాతం కోతను అమలు చేశారు.

అయితే, ఈ విషయంలో ఆరోజు హర్భజన్‌.. సైమండ్స్‌తో ఏమన్నాడో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఈ వివాదంలో అసలు ఏం జరిగిందనే విషయాన్ని తర్వలోనే తెలియజేస్తానని హర్భజన్ తాజాగా ప్రకటించాడు.  

కాగా, అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటన చేశాడు హర్భజన్ సింగ్. తన 23 సంవత్సరాల క్రికెట్ కెరీర్ లో తనకు సహకరిస్తూ… అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థాంక్స్ చెప్పాడు హర్భజన్ సింగ్.


Latest News
more

Trending
more


Viewers
visit counter