టీమిండియా ఘన విజయం-భారత్ 1-0 ఆధిక్యత
30-12-2021
120
సెంచూరియన్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో 305 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 191 పరుగులకే భారత బౌలర్లు అవుట్ చేశారు. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యత సాధించింది.
దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్లలో ఎల్గర్(77), బవుమా(35), డికాక్(21) తప్ప మిగతా వారు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ చెరో 3 వికెట్లు తీశారు. సిరాజ్, అశ్విన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించి టీమిండియాను మెరుగైన స్థితిలో నిలిపిన కేఎల్ రాహుల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. తొలి ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ 123 పరుగులు చేశాడు.
కాగా, తొలి ఇన్నింగ్స్ లో భారత్ 327 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 197 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియాకు 130 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 174 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో సౌతాఫ్రికా ముందు 305 పరుగుల టార్గెట్ నిలిచింది.