అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన హర్భజన్ సింగ్

 24-12-2021     332



భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్ని ఫార్మాట్లలో క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. ట్విట్టర్ వేదికగా రిటైర్మెంట్ ప్రకటించాడు. తన 23 సంవత్సరాల క్రికెట్ కెరీర్ లో తనకు సహకరిస్తూ… అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి స్పెషల్ థాంక్స్ చెప్పాడు హర్భజన్ సింగ్.

'మధురమైన అన్ని అంశాలకు ఇది ముగింపు. జీవితంలో అన్నీ ఇచ్చిన ఆటకు నేటితో వీడ్కోలు పలుకుతున్నాను. ఈ 23 ఏళ్ల ప్రస్థానాన్ని ఆనందమయం, చిరస్మరణీయం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను'  అంటూ ఓ ఎమోషన‌ల్ ట్వీట్ చేశాడు.

1998లో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసిన హర్భజన్ సింగ్ ఆఫ్ స్పిన్నర్ గా భారత జట్టుకు విశేష సేవలు అందించాడు. తన కెరీర్ లో 367 అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు. ఇందులో 711 వికెట్లు తీసి.. చరిత్ర సృష్టించాడు.

2000 దశకంలో టీమిండియా సాధించిన అనేక విజయాల్లో కీలకభూమిక పోషించాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో తనదైన ముద్ర వేశాడు. ఈ పంజాబీ క్రికెటర్ బౌలింగ్ లోనే కాకుండా, బ్యాటింగ్ లోనూ ధాటిగా ఆడుతూ అభిమానులను సంపాదించుకున్నాడు.

కెరీర్ లో 103 టెస్టులు ఆడిన హర్భజన్ 417 వికెట్లు తీశాడు. బ్యాటింగ్ లో 2,224 పరుగులు చేశాడు. వాటిలో 2 సెంచరీలు, 9 అర్ధసెంచరీలు ఉన్నాయి. 236 వన్డేల్లో 269 వికెట్లు తీసి, 1,237 పరుగులు నమోదు చేశాడు.

అంతర్జాతీయ టీ20 పోటీల్లో 28 మ్యాచ్ లలో 25 వికెట్లు పడగొట్టాడు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియాలో హర్భజన్ కూడా ఉన్నాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

అయితే ఆట నుంచి తప్పుకుంటున్న హర్భజన్ సింగ్ క్రికెట్ కామెంటరీ వైపు అడుగులు వేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

 


Latest News
more

Trending
more


Viewers
visit counter