భారత్ లో వాహన రంగం తీవ్ర సంక్షోభం-పెరగనున్న ధరలు
25-12-2021
283
భారత్ లో ఆటోమొబైల్ రంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. పెట్రోల్, డీజిల్ తో నడిచే వాహనాల తయారీ సంస్థల్లో సెమీ కండక్టర్ల కొరత ఏర్పడింది. ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసే కంపెనీలు లిథియం-అయాన్ బ్యాటరీల కొరతతో సతమతమవుతున్నాయి. ఈ బ్యాటరీ తయారీలో వినియోగించే ప్రధాన లోహాలైన లిథియం, నికెల్, కోబాల్ట్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ లో ఏర్పడిన ఆటంకాలు వాహనాల ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి.
2021 ప్రారంభం నుంచి ప్రతి క్వార్టర్ లో ధరలు పెరుగుతూ వస్తున్నాయి. బ్యాటరీల్లో ఉండే 'సెల్' ల ధర 30 శాతం పెరిగింది. బ్యాటరీల తయారీకయ్యే ఖర్చులో 70 శాతం ఈ సెల్ల కోసం వెచ్చించాల్సి వస్తుంది. ఇప్పుడిప్పుడే భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇటువంటి తరుణంలో ఈ పరిణామం తలెత్తడం ఆందోళన కలిగిస్తోంది.
నవంబరులో గరిష్ఠంగా 42,067 ఈవీలు రిజిస్టర్ అయ్యాయి. 40 వేల మార్క్‌ను దాటడం ఇదే తొలిసారి.
బ్యాటరీల్లో కీలక భాగమైన సెల్స్‌ను భారత్ దిగుమతి చేసుకుంటోంది. కాంగో దేశం నుంచి లిథియం ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతోంది. అయితే, కరోనా సంక్షోభం తర్వాత అక్కడి గనుల్లో పనులు నెమ్మదించాయి. పైగా ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ లో ఏర్పడ్డ ఇబ్బందులతో ప్రధాన లోహాల సరఫరా నిలిచిపోవడంతో సమస్య మరింత తీవ్రమైంది. దీంతో 2022లో ఒక్క కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ధర 2.3 శాతం పెరిగి 135 డాలర్లకు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
భారత్ లో ఇప్పటి వరకైతే ఎలక్ట్రిక్ కంపెనీలు పెరుగుతున్న ధరల భారాన్ని వినియోగదారులపై మోపలేదు. ఈసారి సెల్స్ ధరలు మళ్లీ పెరిగితే మాత్రం వాహనాల ధరలు పెంచక తప్పదని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రభుత్వం ఇస్తున్న ప్రత్యేక ప్రోత్సాహకాల వల్ల పెరుగుతున్న నిర్వహణ ఖర్చులను సర్దుబాటు చేసుకుంటున్నామని.. కానీ, ముడి పదార్థాల ధరలు మరింత పెరిగితే ఆ భారాన్ని మోయలేమని అంటున్నాయి.
గత నెలలో రివోల్ట్ మోటార్స్ ఆర్వీ400 ఎలక్ట్రిక్ బైక్ ధరను రూ.18,000 పెంచారు. హీరో సైకిల్స్ సైతం కొన్ని ఈవీల ధరలను రూ.5000 వరకు పెంచింది.