" /> ">


మకర సంక్రమణ తరుణం పల్లెలో వెల్లి విరిసే సంభ్రమణం

 14-01-2023     278మకర సంక్రమణ తరుణం పల్లెలో వెల్లి విరిసే సంభ్రమణం

మనం పండుగలకు చాంద్రమానాన్ని పాటిస్తాము. కనుక తిథులను బట్టి  ఆయా పండుగలను జరుపుకుంటాము. కానీ సంక్రాంతి పండుగ మాత్రం సౌరమానం ప్రకారం జరుపుకుంటాము కనుకే ప్రతి సంవత్సరం తిథులతో సంబంధం లేకుండా పుష్యమాసంలో ఈ పండుగ వస్తుంది. మన సనాతన సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, సామాజిక స్పృహను, నైతిక విలువలను తెలియజేస్తూ, ఆరోగ్యాన్ని కలిగించే, ఆయుష్షును వృద్ధి పరిచే ఎన్నో అంశాలతో కూడిన పండుగ సంక్రాంతి. ప్రకృతి, జీవుడు, దేవుడు, పశుపక్ష్యాదుల సమైక్యతను నిరూపిస్తూ, ఆధ్యాత్మికతను కలిగిన గొప్ప పండుగ  ఇది.

నెల రోజుల నుంచే ఈ పండుగ హడావుడి మొదలవుతుంది. దీన్ని నెల పట్టడం అంటారు. ధనుర్మాసం ప్రారంభమయ్యేది అప్పుడే. సంక్రాంతి నెల పట్టిన నుంచి గ్రామాల్లో,  రంగవల్లులు, పండుగ సందడి ఊపందుకుంటుంది. గృహలక్షులు వేకువజామునే లేచి తమ ఇంటి వాకిళ్లను శుభ్రంగా ఊడ్చి, కళ్లాపి జల్లి ఆపై ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెడతారు. ఇక హరిదాసుల నగర సంకీర్తనలు ప్రజల్ని భగవంతుడిపై భక్తి పారవశ్యంలోకి తీసుకెళ్తాయి. గంగిరెద్దుల వారి సన్నాయి మేళాలు, కొమ్ముదాసరులు, జంగమదేవరలు, బుడబుక్కల వారు తమ కళారూపాలతో సంక్రాంతి పండుగకు గ్రామ గ్రామాన అలరిస్తూ శోభాయమానం కలిగిస్తూ వినోదాన్ని పంచుతారు. భోగిమంటలు వేస్తూ గాలిపటాలను ఎగరేస్తూ కుర్రకారు  గ్రామాలను సంబరాల్లో ముంచెత్తుతారు .గోగులు పూచే గోగులు పూచే ఓ లత్తాగుమ్మాడి వంటి మనసుకు హత్తుకునే జానపద గీతాలు ఆలాపనలు, కేరింతలు, సవ్వడులు వినిపించే తెలుగువారి పండుగ సంక్రాంతి.  పౌష్యలక్ష్మీతో కళకళలాడే గృహప్రాంగణాలతో ఇల్లిల్లూ ఒక కొత్త శోభతో అలలారుతుంది. హాలికుల దరహాసపు కాంతి సంక్రాంతి.  సంక్రాంతి పండుగ అనగానే అందరికి గుర్తుకు వచ్చేది రంగవల్లుల ముత్యాల ముగ్గులు. హరిదాసుల కృష్ణార్పణం సంకీర్తనలు. ఈ పండుగను పెద్దపండుగ అని కూడా అంటారు. ఇది పుష్యమాసం(జనవరి)లో వస్తుంది. ఈ సమయంలో రైతులు ఇళ్లకు ధన, ధన్యరాశులు చేరుతాయి. ప్రజలు పాడి పంటలతో, సుఖశాంతులతో ఉంటారు తెలుగువారి పెద్ద పండుగలలో ఒకటైన సంక్రాంతిని భోగి, సంక్రాంతి, కనుమ అని మూడు రోజుల పండుగగా జరుపుకుంటాము. కనుమ మర్నాడు ముక్కనుమగా కూడా కొన్ని ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలలో జరుపుకుంటారు

మొదటిరోజు భోగి :

భోగి అనే పదం భుజ్ అనే సంస్కృత పదం నుంచి ఉధ్బవించింది. ఆ పండుగ రోజు తెల్లవారుజామున భోగి మంటలు వేస్తారు. శీతాకాలంలో పేరుకున్న చెత్తను అగ్నిలో కాల్చివేయడమే భోగి. ఇలా చేయడం ద్వారా వాళ్ల దురదృష్టాలు తొలగిపోతాయని నమ్మకం. ముఖ్యంగా భోగిని భోగభాగ్యాల పండుగ అని పిలుస్తుంటారు భోగం కాదు త్యాగం అలవరుచుకోమని భోగి ప్రభోదిస్తుంది. గ్రామాల్లో తెల్లవారుజామునే నాలుగు రోడ్లకూడలిలో భోగిమంటలు వేస్తారు. గ్రామ, ఇంటి అరిష్టాలు, రోగ, పీడలు తొలిగిపోవడానికి మంటలను కాస్తారు వ్యవసాయ పనులు ముగిసిపోతాయి కాబట్టి పాడైన పనికిరాని వ్యవసాయ పనిముట్లను, ఇంటిని,గాదెను శుభ్రపరిచినప్పుడు వచ్చిన తాటాకులు బుగిలిన వెదురు బొంగులను ఆవు పేడతో చేసిన చిన్న చిన్న పిడకలను భోగి మంటలో వేస్తారు . ఆవు పిడకల నుంచి వచ్చే పొగ  చలి తీవ్రత వల్ల వాతావరణంలో పెరిగే సూక్షక్రిములఆరికడుతుంది నుంచి దీనివల్ల గ్రామంలో స్వఛ్ఛత గ్రామ ప్రజలకు స్వస్దత చేకూర్చడం భోగి పండుగ పరమార్దం.

 

 

రెండో రోజు సంక్రాంతి

తల స్నానం చేసి కొత్త బట్టలు ధరించి  సంక్రాంతి పండుగ రోజున సూర్యునికి అభిముఖంగా ఆవుపిడకలను పేర్చి కొత్త కుండలో ఆవుపాలు పోసి కొత్త బెల్లం కలిపి కొత్త బియ్యన్ని ఉడికించి పొంగలి తయారు చేసి సుర్యూనికి నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తారు. కొంత పొంగలిని పొలంలో చల్లుతారు. గుమ్మడి మరియు వివిధ రకాల కూరగాయలను కలిపి కలగలుపు కూరగా వండి భోజనంలో ఆరగిస్తారు. ఆనేక రకాల పిండివంటలు తయారు చేసినా ఆరిసెలు ఈ పండుగకు ప్రత్యేక ఆకర్షణ.

మూడోరోజు  కనుము పండుగ

కనుము పండుగను మూడోరోజు జరుపుకుంటారు. కనుము అంటే పశువు అని అర్థం. ప్రధానంగా పశువులను ఆరాధించే రోజు జీవనాధారమై ఏరువాక  నుంచి అన్నదాతతో మమేకమై పాడి పంట ఇంటికి రావటానికి కారణమైన గోవులను, వృషభాలనుపూజించడం ఆచారం. ఈ నేపథ్యంలో కనుము రోజు పశువులు ఉండే పాకలను శుభ్రం చేస్తారు. పశువులను గ్రామంలోని చెరువులో శుభ్రంగా కడుగుతారు. అనంతరం వాటి కొమ్ములకు పసుపు, కుంకుమలు రాసి, నొసట బొట్టు పెట్టి అందమైన బంతిపూలతో అలంకరించి ఆరాధిస్తారు. చక్కటి దాణా వేసి, ఆనందింప జేస్తారు. వ్యవసాయ కూలీలకు, పాలేళ్ళకు కొత్తబట్టలు, ధాన్యాన్ని ఆందజేస్తారు కుల వృత్తుల వాళ్ళకు సైతం ధాన్యాన్ని ఇస్తారు. గ్రామంలోని రైతులు అందించిన ధాన్యం వారికి ఒక సంవత్సర గ్రాసం గా ఉపయోగ పడుతుంది. వ్యవసాయం లో సాయం చేసిన వాటికి కృతజ్ఞతను తెలపడం  కనుమ పరమార్దం

పితృ తర్పణానికి పుణ్య తరుణం మకర సంక్రమణం 

ప్రతి సంక్రమణం పవిత్రమైనదే. ప్రతి సంక్రమణంలోనూ పితృ తర్పణాలివ్వాలి. విశేషంగా మకర సంక్రమణ కాలంలో మకర సంక్రమణ స్నానం చెయ్యాలి. ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి పండుగ రోజున తప్పక పితృ తర్పణాలివ్వాలి, పితృదేవతలను స్తుతించాలి. ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరుకు గడలు, గుమ్మడి పండు మొదలైనవి దానమివ్వాలి. ఈ కాలంలో చేసే గోదానం వల్ల స్వర్గవాసం కలుగుతుందని చెప్తారు.

రంగవల్లి విశిష్టత : గోమయం తో ఇంటి ప్రాంగణం శుద్ది (కళాపి)చల్లడం వల్ల  ఇంటిలోకి రావు మరియు ధ్యానం నిలువ చేసిన గాదులవద్దకు  సూక్షక్రిములు రావు బియ్యపు పిండితో ముగ్గు వేయడం వల్ల చీమలకు అహారం లభిస్తుంది.

గొబ్బిళ్ళ గొప్పతనం:

కొలని దోపరికి గొబ్బిళ్ళో యదుకుల స్వామికిని గొబ్బిళ్ళో ఆంటూ అన్నమయ్య తన సంకీర్తనలలో గొబ్బిళ్ళ సందడిని ప్రస్తావించాడు.ధనుర్మాసమంతా ఆడవారు తెల్లవారుజామునే లేచి ఇళ్ళ ముందు కళ్ళాపి చల్లి, ముగ్గులు పెట్టి, గోమయంతో గొబ్బెమ్మలు పెడతారు. వాటిమీద గొబ్బెమ్మలు పెట్టి, గుమ్మిడి పూలతో, బంతి పూలతో అలంకరించి, మధ్యలో ఉన్న పెద్ద గొబ్బెమ్మను గోదాదేవిగా, చుట్టూరా ఉన్న గొబ్బెమ్మలను ఆమె చెలికత్తెలుగా భావన చేసి, పసుపు కుంకుమలతో పూజించి, హారతిస్తారు గొబ్బీయళోయి గొబ్బిళ్ళు సుబ్బీ గొబ్బెమ్మ సుఖమూ లియ్యావే తామర పువ్వంటి తమ్ముణ్ణియ్యావే చేమంతి పూవంటి చెల్లెల్నియ్యావే అరటి పూవంటీ అక్కానివ్వావే పున్నాగ పూవంటీ అన్నానివ్వవే

మొగలి పూవంటి మొగుణ్ణివ్వావె కలువా పూవంటి కూతుర్నివ్వావె మల్లెపూవంటీ మఱిదినివ్వావె బంతి పూవంటి బావనివ్వావెమామిడి పూవంటి మావనివ్వావె ఆంటూ ఆడి పాడటం వెనుక అనుబంధాలు అత్మీయత దాగిఉన్నాయి

జాన పద కళా కౌముదిని పొదువుకున్న. సంక్రాంతి :

సంక్రాంతికి ముందు నుంచే గంగిరెద్దులను అందంగా అలంకరించి, ఇంటింటికీ గంగిరెద్దు మేళం తెస్తారు. డోలు, సన్నాయి వాయిస్తూ ఉంటే, వాటికి అనుగుణంగా గంగిరెద్దులు నర్తిస్తాయి. ‘అయ్యవారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు‘, అంటుంటే గంగిరెద్దులు మోకాళ్ళ మీద కూర్చుని లేవటం, ‘డూడూ డూడూ బసవన్నా‘ అంటుంటే, తలలూపుతూ విన్యాసాలు చెయ్యటం కన్నుల పండుగగా ఉంటుంది. అందరూ గంగిరెద్దును సాక్షాత్తుగా బసవన్నగా భావించి నూతన వస్త్రాలు కప్పుతారు. వృషభం ధర్మ దేవతకు ప్రతీక.  ఉదయమే శ్రీ మహావిష్ణు స్వరూపునిగా భావించబడే హరిదాసు తలపైన రాగి అక్షయపాత్రను కదలకుండా పెట్టుకుని, రెండు చేతులతో చిరుతలు పట్టుకుని వాయిస్తూ, నుదుటిన తిరునామం పెట్టుకుని, కాళ్ళకు కంచు గజ్జెలు కట్టుకుని, అవి ఘల్లు ఘల్లుమంటుండగా ‘హరిలొ రంగ హరీ‘ఆంటూ హరినామాన్ని స్మరిస్తూ చిందులు వేస్తూ వస్తాడు. తంబూరా మీటుతూ భక్తి సంకీర్తనలు గానం చేస్తూ, వస్తాడు.ప్రజలను అనుగ్రహించడానికి హరిదాసు రూపం వైకుంఠపురం నుండి శ్రీమహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం. సంతోషంగా సాక్షాత్తుగా శ్రీహరే తమ ఇంటి ముంగిటికి వచ్చినంతగా ఆనందిస్తూ ఆ రాగి చెంబులో ధాన్యం పోస్తారు. వారిరువురికీ సంభావనలిచ్చి సత్కరిస్తారు ‘అంబ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు‘ అంటూ చేతిలో డమరుకం పట్టుకుని వాయిస్తూ, జోస్యం చెప్పటానికి ఇంటింటి ముందుకు బుడబుక్కలవాళ్లు వస్తారు. ఈశ్వరుని వలె విభూతి రేఖలు నుదుటి మీద ధరించి, చేతిలో శంఖం పట్టుకుని ఓంకార నాదం చేస్తూ‘హర హర మహాదేవ‘ అంటూ శివ నామ సంకీర్తన చేస్తూ జంగమ దేవర వస్తాడు. వీరందరూ మన సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీకలు. వీరందరినీ గౌరవిస్తూ, స్వయంపాకాలనిచ్చి సంభావిస్తూ మన సంస్కృతిని సంప్రదాయాలను పరిరక్షించుకోవలసిన బాధ్యత మనంద రిది

హేమంతంలో విరిసిన చామంతి  ముంగిట మురిసిన ముద్దబంతి మంచుముత్యాలతో ముగ్గులు దిద్దేను ఇంతి శ్రమైక జీవన జ్యోతులు చిందించే దరహాసపుకాంతి రాశులు కలబోసి విరులు విరబూసి  మహదండిగా మదినిండాగా మనం జరుపుకునే  చలి పండుగే సంక్రాంతి.

 

- *శ్రీధర్ వాడవల్లి – హైదరాబాద్*


Latest News
more

Trending
more


Viewers
visit counter