Logo
Date of Publish : 26 September 2026, 9:29 pm
Editor : B. Anil Kumar

పశువైద్యం..దైన్యం

పశుసంవర్థక శాఖలో ఉన్నతాధికారుల పోస్టులు ఖాళీ

పశువైద్యులు, సిబ్బంది కొరత

ఉన్నవారిలో డిప్యూటేషన్ కు ఎక్కువ మంది

పశువైద్యంపై ప్రభావం

విజేత, అమరావతి బ్యూరో :వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమ అభివ్రద్ధి చెందితేనే రైతులకు స్వాంతన చేరేది. అందుకే ప్రతిరైతు పాడి పశువులను పెంపకం చేపట్టేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కానీ కీలకమైన పశువైద్యసేవల్లో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం కొనసాగుతోంది. పశుసంవర్థక శాఖలో కీలకమైన ఉన్నతాధికారుల పోస్టులు, పశువైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. ఆ ప్రభావం పశువుల పెంపకం, ప్రోత్సాహంపై పడుతోంది. గ్రామీణ పశువైద్యశాలలు అనుకున్న స్థాయిలో పనిచేయడం లేదు. వైద్యులతో పాటు సిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉండడం లేదు. దీంతో పశువైద్యం అందని ద్రాక్షగా మారుతోంది.

అంబులెన్స్ సిబ్బందితో సేవలు..

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పశువైద్య శాలలు అనుకున్న స్థాయిలో అందుబాటులో లేవు. గ్రామీణ పశువైద్య శాలలు నిత్యం తాళాలతో దర్శనమిస్తున్నాయి. వైద్యులు ఉన్నచోట సిబ్బంది లేరు. సిబ్బంది ఉన్న చోట వైద్యులు ఉండని పరిస్థితి. అందుకే కేవలం అంబులెన్స్‌ల్లో ఉండే సిబ్బందితోనే వైద్యం చేయిస్తున్న పరిస్థితి నెలకుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,790 వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల్లో దాదాపు 300 పోస్టులు ఖాళీలున్నాయి. 3,121 పారా వెటర్నరీస్‌ పోస్టుల్లో 690 ఖాళీలున్నాయి. గత ప్రభుత్వం 9,844 గ్రామ పశువైద్య సహాయకులను నియమిస్తామని చెప్పి, 3,739 పోస్టులు ఖాళీగా ఉంచింది.రాష్ట్రవ్యాప్తంగా పశువైద్యశాలలు, జిల్లా, డివిజన్‌ కార్యాలయాల్లో 2,800 ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులు మంజూరై ఉండగా, అందులో 1,832 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.దీంతో గ్రామాల్లో పశుపోషకులకు ఆశించిన సేవలు అందకుండా పోతున్నాయి. కేవలం గతంలో టీడీపీ ప్రభుత్వం 2,600మంది గోపాలమిత్రలను నియమించగా, వారిలో 370మంది సచివాలయ పోస్టులకు ఎంపిక కాగా, మిగతా 2,240 మంది పని చేస్తున్నారు. వీరితోనే ఆయా గ్రామాల్లో పశువైద్యం చేయిస్తున్నారు.

నగరాలు, పట్టణాలకే పరిమితం..

డిప్యూటేషన్లు పశుసంవర్థక శాఖలో విపరీతంగా ఉంటున్నాయి. పశు వైద్యంపై పెను ప్రభావం చూపుతున్నాయి. పశువైద్యంలో పట్టా ఉన్నా వారిలో కొంత మంది వైద్యులు అర్బన్‌ ప్రాంతాల్లో నివాసం ఉంటూ, పరిపాలన విభాగాల్లో పోస్టులు వేయించుకుని, గ్రామీణ పశువైద్యశాలల ముఖం కూడా చూడటం లేదు.కొంత మంది గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్యులుగా ఉన్నా.. పారా వెటర్నరీస్‌, గోపాలమిత్ర, అటెండర్లతో పని చేయిస్తూ, నామమాత్రంగా పని చేస్తూ, తమ విధులను సక్రమంగా నిర్వహించడం లేదన్న విమర్శలున్నాయి.రాష్ట్రంలో రెండు సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌, 12 వెటర్నరీ పాలిక్లినిక్‌లు, 323 ఏరియా వెటర్నరీ హాస్పిటల్స్‌, 1,577వెటర్నరీ డిస్పెన్సరీలు, 1,218రూరల్‌ లైవ్‌స్టాక్‌ యూనిట్లు ఉన్నాయి. వివిధ రకాల వెటర్నరీ ల్యాబ్‌లు 171ఉన్నాయి.ట్రైనింగ్‌ సెంటర్లు, లైవ్‌స్టాక్‌ ఫార్మ్‌లు 16ఉన్నాయి. 340 మొబైల్‌ అంబులేటరీ వెటర్నరీ క్లినిక్‌లు ఉన్నాయి. చాలా చోట్ల గ్రామీణ పశువైద్యశాలల్లో సేవలు అరకొరగా మారడంతో పశుపోషకులు మొబైల్‌ అంబులెన్స్‌లపై ఆధారపడాల్సి వస్తోంది. కానీ నిర్వహణ లేక కొన్ని చోట్ల అంబులెన్స్‌లు కూడా మూలపడ్డాయి.

పశువులకు సరిపడ లేని వైద్యులు

కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా పశుగణన జరిగింది. ఆ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 62లక్షల గేదెలు, 46లక్షల ఆవులు, 55లక్షల మేకలు, కోటీ76లక్షల గొర్రెలు, 10లక్షల కోళ్లుతో కలిపి మొత్తం 3.40కోట్ల పశుగణం ఉండగా, ఈ స్థాయిలో గ్రామాల్లో పశువైద్య సిబ్బంది లేరని సమాచారం.ఈ శాఖకు మంజూరైన పోస్టుల్లో ఖాళీలను ఏళ్ల తరబడి భర్తీ చేయకపోవడం, పోస్టు కేటాయించిన చోట పని చేయకుండా ప్రధాన కార్యాలయాలు, నగరాలు, పట్టణాలకు డిప్యుటేషన్‌ వేయించుకోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్య సేవలు పేలవంగా మారాయి.ఇక నాణ్యమైన పాల ఉత్పత్తి, పశుపోషకులకు ఆర్థిక భారం తగ్గించేందుకు గతంలో ప్రభుత్వం రాయితీపై సరఫరా చేసిన మిశ్రమ దాణ, సైలేజ్‌ గడ్డి, టీఎంఆర్‌ వంటివి సరఫరా చేసిన సంస్థలకు గత ప్రభుత్వం బకాయిలను చెల్లించకుండా, చేతులెత్తేసింది. ప్రస్తుత ప్రభుత్వమైనా పశువైద్య సేవల్ని మెరుగుపర్చి, రాయితీల దాణా, అవసరమైన వ్యాక్సిన్లను సరఫరా చేయాలని పశుపోషకులు కోరుతున్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )