Logo
Date of Publish : 23 September 2026, 11:11 am
Editor : B. Anil Kumar

ఏపీ వైపు దూసుకు వస్తున్న విపత్తు!

* పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో భారీ వాయుగుండం

* ఉత్తరాంధ్రకు చేరువలో కేంద్రీకృతం

* గంటకు 18 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు

* ఇప్పటికే ప్రారంభమైన భారీ వర్షాలు

* శ్రీకాకుళం జిల్లాలో పాఠశాలలకు సెలవులు

విజేత, అమరావతి బ్యూరో:ఏపీ వైపు పెను విపత్తు దూసుకు వస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర రూపం దాల్చుతోంది. గత కొన్ని గంటలుగా.. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదులుతోంది. రాబోయే 12 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుంది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత... గురువారం తెల్లవారుజామున ఉత్తర కోస్తాంధ్రలోని విశాఖ- గోపాల్ పూర్ మధ్య తీరం దాటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది కళింగ పట్నానికి ఆగ్నేయంగా 200 కిలోమీటర్లు, విశాఖపట్నం కి తూర్పుగా 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాతావరణం భీకరంగా మారింది. పిడుగులు, ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, విశాఖ జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, వైయస్సార్ కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సైతం మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.

* పాఠశాలలకు సెలవులు..

భారీ వర్షాల కారణంగా శ్రీకాకుళం జిల్లాలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. మంగళవారం అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలలకు ఒక్క పూట సెలవు ఇచ్చారు. బుధవారం సైతం సెలవులు ప్రకటిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాలకు వరద హెచ్చరికలు జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాలు, వాగులు వంకలు ఉన్న గ్రామాల ప్రజలు, లోతట్టు ప్రాంతవాసులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. వర్షాలతో రోడ్లపై భారీగా నీరు నిలవడం, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో చాలాచోట్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పిడుగుపాట్లు, బలమైన ఈదురు గాలుల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉంది. ప్రధానంగా ఈ విపత్తుతో విద్యుత్, రవాణా, తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడవచ్చు అని వాతావరణ శాఖ హెచ్చరించింది. చెరువులు, డ్యామ్ లు ఉప్పొంగే అవకాశం ఉన్నందున.. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు రావద్దని.. ప్రమాదకర చెట్లు, విద్యుత్ లైనుల కింద నిలబడవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

* సముద్రం అల్లకల్లోలం..

భారీ వాయుగుండం ప్రభావంతో బంగాళాఖాతంలో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులు ఈనెల 27 వరకు చేపల వేటకు వెళ్ళవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికీ సముద్రంలో వేటకు వెళ్లినవారు తీరానికి చేరుకోవాలని కూడా సూచిస్తున్నారు. తీరప్రాంత ప్రజలు అప్రమంతంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. తీరంలో ఉండే పడవలు, వేట సామాగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేయడం విశేషం. భారీ విపత్తు నేపథ్యంలో ప్రభుత్వం ముందుగానే స్పందించింది. కోస్తాంధ్రలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా ఉండాలని ఆదేశాలు ఇచ్చింది.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )