ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం
అక్షర విజేత, మంచిర్యాల ప్రతినిధి
బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీ పరిధి జాతీయ రహదారి 363 పై చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి చేపట్టవలసిన చర్యలపై అన్ని విభాగాల అధికారులతో కలిసి బెల్లంపల్లి ఆర్డిఓ కార్యాలయంలో బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ ఆధ్వర్యంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమాదాల నివారణకై చేపట్టవలసిన చర్యల గురించి ఇటు అధికారులు, అటు ప్రజల నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారిపై ప్రమాదాలు జరగకుండా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, రాత్రి సమయంలో వాహనాలు స్పష్టంగా కనిపించేలా హైమాస్ట్ లైట్లు, అదేవిధంగా యూటర్న్ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు సూచికలు ఏర్పాటు చేయాలని అదేవిధంగా జాతీయ రహదారిని ఆనుకొని నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా నిర్మాణాలు జరిగినా అవి తొలగించేలా చర్యలు తీసుకోవాలని నేషనల్ హైవే అధికారులకు సూచించినట్లు తెలిపారు. రహ జాతీయ రహదారిని ఆనుకొని ఏర్పాటు చేసిన మద్యం దుకాణం వల్ల ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు పోలీసులకు సూచించినట్లు పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని నిత్యం పెట్రోలింగ్ చేపట్టనున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలకు నోటీసులు అందజేసి తొలగించాలని ఆదేశించారు. సమావేశంలో నేషనల్ హైవే అధికారులు, ఎక్సైజ్, బెల్లంపల్లి మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.