ఉత్సాహంగా సాగిన 5కె రన్
అక్షర విజేత, నిజామాబాద్ సిటీ
ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వీలుగా భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం ‘ఐ ఓట్ ఫర్ షూర్’ అనే నినాదంతో నిర్వహించిన 5కె రన్ ఉత్సాహంగా సాగింది. వివిధ వర్గాల వారు స్వచ్చందంగా 5కె రన్ లో పాల్గొని ప్రజాస్వామ్య పరిణతి చాటారు. వివిధ శాఖల అధికారులతో పాటు డ్వాక్రా సంఘాల సభ్యులు, యువజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థిని విద్యార్థులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, యువతీ యువకులు పెద్ద ఎత్తున 5కె రన్ లో భాగస్వాములయ్యారు. 5కె రన్ విజయవంతానికి ముందస్తుగానే విస్తృత స్థాయిలో చేపట్టిన ఏర్పాట్లు సత్ఫలితాలు ఇచ్చాయి. పాత కలెక్టరేట్ నుండి చేపట్టిన 5కె రన్ ను నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్ జెండా ఊపి ప్రారంభించారు. ఐ ఓట్ ఫర్ షూర్ అనే నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ వివిధ వర్గాల వారు ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల మీదుగా తిరిగి ఓల్డ్ కలెక్టరేట్ మైదానం వరకు పరుగు నిర్వహించారు. నోడల్ అధికారి నేతృత్వంలో అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేస్తూ 5కె రన్ విజయవంతం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి కీలకమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు. పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కొత్త ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం కల్పిస్తున్న అవకాశాన్ని యువత వినియోగించుకోవాలని కోరారు. ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా ఓటును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. 5కె రన్ లో నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ శంకర్, స్వీప్ నోడల్ అధికారి సురేష్ కుమార్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ముత్తెన్న, జిల్లా యువజన అధికారిని శైలీ బెల్లాల్, మున్సిపల్ అధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.