ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా అభ్యర్థి గాలి అనిల్ కుమార్

అక్షర విజేత జుక్కల్ ప్రతినిధి
మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అధ్యక్షతన జుక్కల్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి, జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నియోజకవర్గం నలుమూలల నుంచి నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఆరోపించారు. తన ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నాయకత్వంలోనే ఉంటానని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో గాలి అనిల్ కుమార్ గారికి జుక్కల్ నియోజకవర్గం నుంచి 30వేల మెజార్టీ ఇవ్వాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గాలి అనిల్ కుమార్ గారి గెలుపుతో నియోజకవర్గంలో పార్టీకి పూర్వ వైభవం వస్తుందని హన్మంత్ షిండే తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తప్పుడు హామీల మీద ప్రజలకు భ్రమలు తొలగిపోయాయని గాలి అనిల్ కుమార్ గారు పేర్కొన్నారు. కారు గుర్తుకు ఓటు వేయడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు.రాబోయేది అంతా మనకు మంచి కాలమే అని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఢిల్లీలో తెలంగాణ గొంతు వినిపించాలంటే కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని గాలి అనిల్ కుమార్ విజ్ఞప్తి చేశారు. పార్టీ మారిన నాయకులతో బీఆర్ఎస్ పార్టీలోని స్క్రాప్ పోయింది అని.. ముత్యాలాంటి నాయకులు, కార్యకర్తలు మిగిలారని పోచారం శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్న బీబీ పాటిల్, 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్న సురేష్ షెట్కార్ తమ పదవి కాలంలో చేసిన అభివృద్ధి పనులు చెప్పి ఓట్లు అడగాలని వారికి సవాలు విసిరారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు మరిచిపోయింది అని పోచారం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల కంటే ఎక్కువ ప్రకటించిన కాంగ్రెస్ కనీసం పాత పథకాలను కూడా అమలు చేయలేకపోతోందని ఎద్దేవా చేశారు.ఉద్యమకారుడు, బీసీ నాయకుడు అనిల్ కుమార్ అందరం ఐక్యమత్యంతో గెలిపించుకోవాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.